విజయవాడ: ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నకిలీ సర్టిఫికెట్లు కలకలం రేపింది. ఇప్పటికే ఆలయ అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఇద్దరు ఉద్యోగులు ఈ వివాదంలో చిక్కుకున్నారు. ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు పదోన్నతి కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు బయటపడింది. 

ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గమ్మ ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రాజు, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్ నఖిలీ సర్టిఫికెట్లు సమర్పించిట్లు తేలింది. అధికారుల విచారణలో ఈ నకిలీ సర్టిఫికెట్లు బాగోతం బయటపడింది. దీంతో ఇద్దరు ఉద్యోగులను ఆలయ ఈఓ సస్పెండ్ చేశారు. ఇద్దరు ఉద్యోగులపై కేసు నమోదు చేసే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవల దుర్గగుడి ఈవో సురేశ్ బాబుపై ప్రభుత్వం బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో భ్రమరాంబను నియమించింది ప్రభుత్వం.  ప్రముఖ ఆలయాల్లో  విజయవంతంగా విధులు నిర్వహించిన భ్రమరాంబకు విజయవాడ ఆలయ బాధ్యతలు అప్పగించారు.  

read more  విజయవాడ దుర్గగుడి ఈవో సురేష్ బాబు అవకతవకలు: ఏసీబీ నివేదికలో కీలక అంశాలు

ఇదిలావుంటే విజయవాడ దుర్గగుడిలో చీరల విభాగంలో అక్రమాలను ఏసీబీ నివేదిక తేటతెల్లం చేసింది.  చీరల ధరలు, బార్ కోడింగ్ ధరలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్న విషయాన్ని ఏసీబీ గుర్తించింది. అమ్మవారికి భక్తులు చీరెలు సమర్పిస్తారు. పట్టు చీరెలతో పాటు ఇతర చీరెలను కూడ భక్తులు అమ్మవారికి బహుకరిస్తారు. అయితే ఇలా భక్తులు సమర్పించిన పట్టు చీరెల విభాగంలో రూ. 7 వేల, రూ. 35 వేల చీరెలు కన్పించకుండా పోయినట్టుగా ఏసీబీ నివేదిక తెలుపుతోంది. రూ. 15 వేల విలువైన చీర ధరను రూ. 2500 గా ముద్రించారు.

ఏసీబీ నివేదిక ఆధారంగా ఇప్పటికే 20 మంది ఉద్యోగులపై దేవాదాయశాఖ సస్పెన్షన్ వేటు వేసింది. మరోవైపు ఈ దేవాలయంలో అక్రమాలపై గత ఈవో సురేష్ బాబు పాత్రను ఏసీబీ అందించింది. తుది నివేదికను నెల రోజుల్లో ప్రభుత్వానికి ఏసీబీ అందించనుంది.  ఈ నివేదికల్లో రోజు రోజుకి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.