విజయనగరం జిల్లాలో లారీ, టూరిస్ట్ బస్సు ఢీ : ముగ్గురు ప్రయాణికుల మృతి

vijayanagaram road accident
Highlights

32 మందికి తీవ్ర గాయాలు...

విజయనగరం జిల్లా బోగాపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ కతా-చెన్నై జాతీయ రహదారిపై లారీ, ఓ టూరిస్ట్ బస్సు ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విశాఖవాసులు మృతిచెందగా మరో 32 మంది  తీవ్రంగా గాయపడ్డారు. 

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం సమీపంలోని కోడూరు గ్రామానికి చెందిన సుమారు అరవై మంది భక్తులు ఓ టూరిస్టు బస్సులో కాశీ యాత్రకు వెళ్లారు. యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన వీరు మరో రెండు గంటల్లో స్వగ్రామానికి చేరుకుంటారనగా బస్సు ప్రమాదానికి గురయ్యింది. లారీ మితిమీరిన వేగంతో వచ్చి ఢీ కొట్టడంతో బస్సు ప్రమాదకర రీతిలొ బోల్తా పడింది.  దీంతో ప్రయాణికులు చాలా మంది అందులో చిక్కుకుపోయారు.  

ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని కాపాడారు. అలాగే లారీ క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ ను కూడా కాపాడి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 

ఈ ప్రమాదం పై హోంమంత్రి చినరాజప్ప జిల్లా ఎస్పీని అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలిపిన హోంమంత్రి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. సహాయ కార్యక్రమాల కోసం అవసరమైతే అదనపు  పోలీసు బలగాలను ఘటన స్ధలానికి  తరలించాలని ఎస్పీని ఆదేశించారు.

 

loader