ఫిరాయింపులపై 3 నెలల్లో తేల్చేయాలట..సాధ్యమేనా ?

ఫిరాయింపులపై 3 నెలల్లో తేల్చేయాలట..సాధ్యమేనా ?

చట్ట సభల్లో సభ్యుల అనర్హతపై మూడు నెలల్లో తేల్చాల్సిందేనంటూ ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సభాపతులను కోరారు. రాజ్యసభలో ఇద్దరు సభ్యులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వారిని అనర్హులుగా వెకయ్యనాయుడు ప్రకటించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, చట్టసభల సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లే అని అభిప్రాయపడ్డారు. సభ్యుల అనర్హతపై అందిన ఫిర్యాదులను ఆయా సభల ప్రిసైడింగ్ అధికారులు పరిశీలించి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఇద్దరు రాజ్యసభ సభ్యుల అనర్హతపై తనకు ఫిర్యాదు అందిన నెలలోపే తాను విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు వెంకయ్య స్పష్టం చేశారు. వెంకయ్య చెప్పింది బాగానే ఉన్నా ఇక్కడే ఒక సందేహం వస్తోంది. వెంకయ్య అనర్హులుగా తేల్చిన ఇద్దరు సభ్యులు కూడా ప్రతిపక్షానికి చెందిన వారు. అదే ప్రతిపక్షాల నుండి అధికార పార్టీ వైపు వచ్చి వుంటే అప్పుడు కూడా వారిపై ఇదే విధంగా వెంకయ్య చర్యలు తీసుకుని ఉండేవారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

తెలుగు రాష్ట్రాల సంగతే తీసుకుంటే, ఏపిలో ముగ్గురు, తెలంగాణాలో ఒక లోక్ సభ సభ్యుడు పార్టీలు ఫిరాయించారు. వారిని అనర్హులుగా చేయాలని వైసిపి, కాంగ్రెస్, టిడిపిలు లోకసభ స్పీకర్ కు ఫిర్యాదులు చేసి కూడా చాలా కాలమైంది. మరి, ఎందుకని స్పీకర్ చర్యలు తీసుకోలేదు? ఆ విషయాన్ని పక్కనబెడితే, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలకు చెందిన ఎంతో మంది ఎంఎల్ఏలు అధికారపార్టీల్లోకి జంప్ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని వైసి.పి, టిడిపి, కాంగ్రెస్ ఫిర్యాదు చేసినా స్పీకర్లు ఎందుకని చర్యలు తీసుకోలేదు? వారంతా ప్రతిపక్షంలో నుండి అధికారపార్టీలోకి జంప్ చేసారు కాబట్టే.

ఇదిలావుండగా, ఏపిలో అధికార పార్టీ నుండి ప్రతిపక్ష వైసిపిలోకి వెళ్ళిన శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాను మాత్రం శాసనమండలి చైర్మన్ వెంటనే ఆమొదించేశారు. ఎందుకనంటే సభ్యుడు ప్రతిపక్షంలోకి వెళ్ళారు కాబట్టే. ఉద్దేశ్యపూర్వకంగానే స్పీకర్లు, ముఖ్యమంత్రులు కలిసి గేమ్ ఆడుతుంటే, పిరాయింపుల నిరోధక చట్టం అపహాస్యంకాక మరేం అవుతుంది? మళ్ళీ అందరూ ప్రతీ రోజు ప్రజాస్వామ్య విలువల గురించి ఎదుటివారికి నీతులు చెప్పేవారే.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos