ఏపికి ప్రత్యేకహోదా వచ్చే అర్హత లేనే లేదని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అంటే సినిమాల్లో చూపినట్లు నాడు రాజ్యసభలో వెంకయ్య చేసిందంతా డూప్ ఫైటింగేనా?

‘ఏరు దాటేంత వరకూ ఓడ మలన్న. దాటంగానే బోడి మలన్న’ అని వెనకటికొక సామెత ఉండేది. ఆ సామెత కేంద్రమంత్రి వెంకయ్యనాయడుకు సరిగ్గా సరిపోతుంది. ప్రత్యేకహోదా అంశంపై వెంకయ్య తాజాగా మాట్లాడిన మాటలు పై సామెతలాగే వుంది. కాకినాడలో జరిగిన ఓ బహిరంగ సభలో వెంకయ్య మాట్లాడుతూ, ఏపికి ప్రత్యేకహోదా వచ్చే అర్హత లేనే లేదని మరోసారి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ప్రత్యేకహోదా రావాలంటే ఆ రాష్ట్రానికి కొండ ప్రాంతాలు, అడవులు, గిరిజనులు ఎక్కువగా ఉండటం దేశ సరిహద్దులున్న రాష్ట్రాలకు మాత్రమే అవకాశం ఉందట. వెంకయ్య బాగానే శెలవిచ్చారు.

 మరి, రాష్ట్ర విభజన సమయంలో ఏపికి ప్రత్యేకహోదా కోసం ఎందుకు పోరాటం చేసినట్లు. ప్రత్యేకహోదా పొందటానికి ఏపికి ఏ విధంగాను అర్హత లేదన్న విషయం డప్పు వెంకయ్యకు తెలియదా. దశాబ్దాల తరబడి కేంద్రంలో చక్రం తిప్పుతున్న వెంకయ్య గతంలో కేంద్రంమంత్రిగా కూడా పనిచేసారు కదా. ఏపికి హోదా రాదని తెలిసీ మరి ఎందుకు పోరాటం చేసినట్లు. అదంతా నటనే అని ప్రజలు ఇపుడు అనుకుంటే వారి తప్పు ఎలా అవుతుంది.

నాటకంలో తానొక్కడే పాత్రదారి కాకుండా అరుణ్ జైట్లీని, ఆ తర్వాత నరేంద్రమోడిని కూడా ఎందుకు భాగస్తులను చేసినట్లు? నాటి ప్రధానమంత్రి ఏపికి ప్రత్యేకహోదాను ఐదేళ్ల పాటు ఇచ్చిన హామీని పదేళ్ళ పాటు ఉండాలని ఎందుకు పట్టుబట్టినట్లు. వెంకయ్యే సమాధానం చెప్పాలి. అంటే సినిమాల్లో చూపినట్లు నాడు రాజ్యసభలో వెంకయ్య చేసిందంతా డూప్ ఫైటింగేనా?

కాకినాడ సభలోనే వెంకయ్య మరో మాట కూడా చెప్పారు. కేంద్రప్రభుత్వంలో నుండి చంద్రబాబు బయటకు వచ్చేస్తే నష్టం రాష్ట్ర ప్రజలకే అట. అటు ప్రధానమంత్రి నరేంద్రమోడికి గానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు గాని ఎటువంటి నష్టమూ లేదట. కేంద్రంలోని ఎన్డిఏ సర్కార్ లో భాగస్వామిగా ఉన్న కారణంగా ఏపికి ఇప్పటి వరకూ ఎటువంటి లాభం జరగలేదని ఓ వైపు ప్రజలు, ప్రతిపక్షాలే నినదిస్తున్నారు. కేంద్రప్రభుత్వంలో నుండి బయటకు వచ్చేస్తే కనీసం నిరసన తెలిపినట్లన్నా అవుతుందని ప్రజలు చంద్రబాబును కోరుతున్నారు.

 తరచూ, ప్రజలే తనకు హై కమాండ్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలు చెప్పినట్లుగా ఎన్డిఏ ప్రభుత్వంలోని నుండి బయటకు వచ్చేయోచ్చుకదా. ఎందుకంటే, కేంద్రంలో భాగస్వామిగా ఉన్నందు వల్ల ఏపికి కేంద్రం ఇపుడు అదనంగా తవ్వి తలకెత్తుకున్నదేమీ లేదు. కేంద్రంలో నుండి బయటకు వచ్చేస్తే హై కమాండ్ మాటను మన్నించిన మంచి పేరన్నా చంద్రబాబుకు దక్కుతుంది కదా? వెంకయ్య మాటలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఇపుడున్న సీట్లు కూడా రావటం ఇష్టం లేనట్లే కనబడుతోంది.