మంత్రుల్లో వాస్తు భయం 3వ బ్లాకంటేనే దూరం

vastu troubles hunt new minister Lokeshs office in Velagapudi
Highlights

సచివాలయం ప్రారంభోత్సవం రోజునే చంద్రబాబు ‘ఓటుకునోటు’ కేసులో సుప్రింకోర్టు నుండి నోటీసులు అందుకున్నారు. మరుసటి రోజే కరీంనగర్ కోర్టు నుండి ఎన్నికల వ్యయం అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నోటీసులు అందుకున్నారు.

వెలగపూడిలో మంత్రులకు వాస్తు భయాలు వెన్నాడుతున్నాయ్. తాత్కాలిక సచివాలయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆరు బ్లాకులు కట్టింది. అందులో మొదటి బ్లాకులో ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి ఉంటారు. ఆరో బ్లాకులో అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ ఉంటారు. మిగిలిన నాలుగు బ్లాకుల్లోనే మంత్రులు, ఉన్నతాధికారులు ఉండాలి. ఇక్కడే సమస్య మొదలైంది. కారణాలేవైనా మిగిలిన నాలుగింటిల్లో 3వ బ్లాకులోకి వెళ్ళాలంటేనే మంత్రులు భయపడుతున్నారు.  

మొన్నటి వరకూ 3వ బ్లాకులో పీతల సుజాత, రావెల కిషోర్ బాబు, కొల్లు రవీంద్ర విధులు నిర్వహించేవారు. అయితే, పీతల, రావెలకు మంత్రిపదవులు ఊడిపోయాయి. మిగిలిన కొల్లు రవీంద్రకు కూడా ఆబ్కారీ, బిసి సంక్షేమ వంటి పెద్ద శాఖల్లో కోత పడింది.  విస్తరణ ముందు వరకూ కూడా కొల్లుకు ఉధ్వాసన తప్పదనే అనుకున్నారు. అయితే చివరి నిముషంలో పదవిని నిలుపుకున్నారు. అయితే, ఇపుడు యువజన శాఖ మాత్రమే చూస్తున్నారు. దాంతో కొత్త మంత్రులను ఎవరిని కదిలించినా 3వ బ్లాకులోకి వెళ్ళటానికి ఇష్టపడటం లేదు. సరే కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రుల్లో ఎవరో ఒకరు వెళ్ళక తప్పదనుకోండి అది వేరే సంగతి.

ఇదిలావుండగా, 2వ బ్లాకులో మంత్రులు నారాయణ, కెఇ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప ఉన్నారు. వీరిలో ఒకరిని ఖాళీ చేయించి లోకేష్ చేరుదామనుకున్నారట. కానీ సాధ్యం కాక చివరకు 5వ బ్లాకులో సర్దుకున్నారు. సీనియర్ మంత్రుల్లో ఎవరినైనా ఖాళీ చేయిద్దామని ప్రభుత్వంలోని ముఖ్యులు అనుకున్నారట. అయితే, నేరుగా అడిగితే బాగుండదని జిఏడి ఉన్నతాధికారుల ద్వారా అడిగించారట. అయితే, ఉన్నతాధికారులు అడిగినపుడు మంత్రులు కుదరదు పొమ్మనారట.

మొత్తానికి వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో వాస్తు సమస్యలు చాలానే ఉన్నట్లు ప్రచారం మొదలైపోయింది. ఎందుకంటే, సచివాలయం ప్రారంభోత్సవం రోజునే చంద్రబాబు ‘ఓటుకునోటు’ కేసులో సుప్రింకోర్టు నుండి నోటీసులు అందుకున్నారు. మరుసటి రోజే కరీంనగర్ కోర్టు నుండి ఎన్నికల వ్యయం అంశంపై స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు నోటీసులు అందుకున్నారు.

loader