విజయవాడ: మూడు రాజధానుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చిచ్చు పెట్టినట్లే ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే, ఈ డిమాండ్ మీద ఎక్కువగా టీడీపీ నేతలే స్పందిస్తున్నారు. 

ఇప్పటికే తూళ్లూరులో టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి రాజీనామాల గురించి తన వైఖరిని వెల్లడించారు. తాజాగా మరో టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందించారు. మూడు రాజధానులపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక్కరే రాజీనామా చేస్తే సరిపోదని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తారని ఆయన సోమవారం చెప్పారు. 

Also Read: రాజధాని తరలింపును అడ్డుకునే ప్రయత్నం...హైకోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు

రాజధాని మార్పు అనేది సంచలన విషయం కాబట్టి శాసనసభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని ఆయన అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలని ఆయన అన్నారు. రాజధాని మార్పు అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనల్లో మొదటి నుంచీ ఉందని ఆయన అన్నారు. రాజధానిని మారుస్తామని జగన్ పాదయాత్రలో ఎందుకు చెప్పలేదని, మేనిఫెస్టోలో ఎందుకు చేర్చలేదని ఆయన అడిగారు. మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయం కూడా కోరాలని ఆయన అన్నారు. 

మూడు రాజధానుల వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీనామాల రాజకీయం నడుస్తోంది. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ చెప్పిన విషయం తెలిసిందే. వల్లభనేని వంశీ గన్నవరం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే.

Also Read: జగన్ కు భయపడి వాళ్లు రాజీనామా చేయడం లేదు: బిటెక్ రవి

మూడు రాజధానులకు వ్యతిరేకంగా, లేదంటే అమరావతిని రాజధానిగా జగన్ ప్రభుత్వం కాదనడానికి వ్యతిరేకంగా కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి చెందిన 23 మంది శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఆహ్వానించాలని వైసీపీ నేతలు కూడా చంద్రబాబును డిమాండ్ చేస్తున్నారు. మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే రోజా అదే డిమాండ్ చేశారు. ప్రాంతానికి ఒక్కరి చొప్పున రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి సవాల్ చేశారు. 

ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు తిరిగి గెలిస్తే అమరావతికి కట్టుబడి ఉంటామని, లేదంటే జగన్ నిర్ణయాన్ని అంగీకరించాలని రోజా చంద్రబాబును డిమాండ్ చేశారు. మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వాగ్వివాదాలు జరుగుతున్నాయి.