గుంటూరు:  వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బిటెక్ రవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్యెల్యేలు రాజీనామా చెయ్యాలని ఆయన సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి భయపడి, రాజీనామా చెయ్యలేకపోతున్నారని ఆయన అన్నారు. రాజధానికి సంబంధం లేని తాను రాజీనామా చేశానని ఆయన చెప్పారు.

 పాలనా వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ బిటెక్ రవి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన సోమవారం అమరావతి రాజధాని ప్రాంతం తూళ్లూరులో సోమవారం పర్యటించారు. ఇక్కడి ప్రజల చేత ఓట్లు వేయించుకున్న వైసీపీ ప్రతినిధులు ఎందుకు రాజీనామా చేయడంలేదని ఆయన అడిగారు. 

Also Read: జగన్ మూడు రాజధానులపై కేంద్రం పక్కా వ్యూహం

ఎన్నికలకి ముందు రాజధాని ఇక్కడే ఉంటుందని జనాన్ని నమ్మించడం వల్లే వైసీపీ అభ్యర్థులకు ఓట్లు పడ్డాయని ఆయన అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు ప్రతిపాదన ఎందుకు పెట్టలేదని అడిగారు. మ్యానిఫెస్టోలో మూడు రాజధానులు ప్రతిపాదన పెట్టి ఉంటే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయి ఉండేదని అన్నారు. 

ఇక్కడ అందరూ పెయిడ్ ఆర్టిస్టులు అయితే... వైసిపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్ళీ గెలవాలని, తాను  శాశ్వతంగా రాజకీయలనుండి తప్పుకుంటానని ఆయన అన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టో ని బైబిల్, ఖురాన్ లతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని అడిగారు. తాము ప్రజల్లో తిరగలేకపోతున్నామని ఇక్కడి ప్రజా ప్రతినిధులు సీఎం జగన్మోహన్ రెడ్డి తో చెప్పాలని ఆయన అన్నారు. అలా చెప్పే ధైర్య లేకపోతే దద్దమ్మలమని రాజధాని వాసులతో చెప్పాలని ఆయన అన్నారు.

Also Read: మూడు రాజధానులు: చంద్రబాబును చిక్కుల్లో పడేసిన పవన్ కల్యాణ్

మూడు రాజధానులకు నిరసనగా, అమరావతి రైతులకు మద్దతుగా కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. దానిపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్యుద్ధం జరుగుతోంది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాను రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు.