న్యూఢిల్లీ: అమరావతిలోనే  రాజధాని ఉండాలనే రైతుల డిమాండ్ న్యాయబద్దమైందని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు.గురువారం నాడు అమరావతి మహిళా జేఏసీ నేతలు కేంద్ర మంత్రిని న్యూఢిల్లీలో కలిశారు.  ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

పేద, దళిత రైతులు రాజధాని కోసం భూములిచ్చి త్యాగం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ ఏపీ సీఎం జగన్ కు లేఖ రాస్తానని ఆయన హామీ ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం తమ పట్ల వ్యవహరిస్తున్న తీరును జేఏసీ నేతలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.మహిళా జేఏసీ నేతలు బుధవారం నాడు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు.

also read:అమరావతిలోనే రాజధాని: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మహిళా జేఏసీ నేతల వినతి

ఏపీ రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అమరావతికి మద్దతును కూడగట్టేందుకు జేఏసీ నేతలు ఢిల్లీకి చేరుకొన్నారు. 

అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జేఎసీ నేతలు 270 రోజులకు పైగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానులను నిరసిస్తూ రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు కూడ దాఖలు చేసిన విషయం తెలిసిందే.