న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు విషయమై శుక్రవారం నాడు ప్రధానమంత్రి కార్యాలయంలో కీలక సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సూచించినా కూడ రివర్స్ టెండర్లను  ఏపీ సర్కార్ ఆహ్వానించింది. 

ఈ విషయమై కూడ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరో వైపు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాల ఆశీస్సులతోనే జగన్ నిర్ణయాలు తీసుకొంటున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పడంపై కూడ కేంద్రం అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం.

ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు చెప్పిన తర్వాతే జగన్ నిర్ణయాలను తీసుకొంటున్నారని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ ప్రకటనను మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఖండించారు. 

పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండరింగ్ వంటి అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టుగా విజయసాయిరెడ్డి చెప్పారు. వీరిద్దరి ఆశీస్సులు జగన్ కు ఉన్నాయని ఆయన ప్రకటించారు.  ఈ విషయాన్ని సుజనా చౌదరి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ దృష్టికి తీసుకెళ్లాడు. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి షెకావత్  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్లను ఆహ్వానించడంపై కూడ కేంద్రం పీపీఏ నుండి నివేదిక కోరింది.ఈ విషయమై పీపీఏ కూడ కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.ఇదే విషయమై కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్  తమ శాఖాధికారులతో చర్చించినట్టుగా తెలుస్తోంది.

 ఈ ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకొనే ముందు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా లతో చర్చించనున్నట్టు షెకావత్ సుజనాకు హామీ ఇచ్చినట్టు సమాచారం. మరో వైపు ప్రాజెక్టు నిర్మాణాన్ని కేంద్రం చేపట్టాలని కూడ సుజనా కోరినట్టుగా తెలుస్తోంది.అయితే దీనిపై మంత్రి స్పష్టత ఇవ్వలేదని సమాచారం.

మరో వైపు పోలవరం ప్రాజెక్టుపై శుక్రవారం నాడు పీఎంఓ కార్యాలయంలో సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ స్పెషల్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ ఢిల్లీకి చేరుకొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో ఆదిత్యనాథ్ దాస్ చర్చించారు.

పీపీఏల రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాన్ని కూడ కేంద్రం తప్పుబట్టింది.ఈ విషయమై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కె సింగ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు రీ టెండరింగ్ విషయం కూడ కేంద్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.శుక్రవారం నాడు జరిగే ఈ సమావేశంలో కేంద్రం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నెల 13వ తేదీన హైద్రాబాద్ లో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ల వల్ల నష్టమని పోలవరం ప్రాజెక్టు  అథారిటీ ఏపీ ప్రభుత్వానికి చెప్పింది. అంతేకాదు ప్రాజెక్టు నిర్మాణం కూడ ఆలస్యం కానుందని చెప్పింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 16వ తేదీన లేఖ రాసింది. అయినా కూడ ఏపీ సర్కార్ ఈ విషయాన్ని పట్టించుకోకుండానే  ఈ నెల 17వ తేదీన రూ. 4900 కోట్లకు రివర్స్ టెండర్లను ఆహ్వానించింది.

హైడల్ ప్రాజెక్టు, హెడ్ వర్క్స్  పనులకు గాను రివర్స్ టెండర్లను 2015-16 రేట్లకు చేయాలని కోరుతూ టెండర్లను కోరింది. అయితే  హైడల్ ప్రాజెక్టు పనులను ఇప్పటికే నవయుగ కంపెనీకి కేటాయించింది.అయితే నవయుగ కంపెనీకి దక్కిన టెండర్లను రద్దు చేస్తూ రివర్స్ టెండర్లను పిలిచింది.

దీంతో ఈ నెల 20వ తేదీన నవయుగ కంపెనీ ఈ విషయమై హైకోర్టును ఆశ్రయించింది. జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనులపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులను ఈ నెల 22వ తేదీన ఇచ్చింది.మరో వైపు హెడ్ వర్క్స్ పనులకు మాత్రం హైకోర్టు ఉత్తర్వులు వర్తించవని  ప్రభుత్వం చెబుతుంది.

సంబంధిత వార్తలు

జగన్ ఇప్పుడేం చెబుతారు: పోలవరంపై హైకోర్టు ఉత్తర్వులపై బాబు

జగన్‌కు హైకోర్టు షాక్: రివర్స్ టెండరింగ్ పై మధ్యంతర ఉత్తర్వులు

తగ్గని జగన్: పోలవరం అథారిటీకి కౌంటర్
పోలవరంపై నవయుగ పిటిషన్: వాదనలు పూర్తి, తీర్పు రిజర్వ్

పోలవరం: జగన్ సర్కార్ నిర్ణయంపై కోర్టుకెక్కిన నవయుగ

జగన్‌కు షాక్: రివర్స్ టెండరింగ్‌పై పీపీఏను నివేదిక కోరిన కేంద్రం

సీఈఓ లేఖ బేఖాతరు: పోలవరం పనులకు రివర్స్ టెండర్ల ఆహ్వానం

రివర్స్ టెండరింగ్ పై సీఈఓ లేఖ: జగన్ నిర్ణయంపై ఉత్కంఠ

నష్టమే: రివర్స్ టెండరింగ్‌పై జగన్ సర్కార్ కు జైన్ లేఖ

సీఈవో హెచ్చరికలు బేఖతారు: పోలవరంపై మడిమ తిప్పని జగన్

రీటెండరింగ్ వద్దు, నవయుగే ముద్దు: సీఎం జగన్ కు సీపీఐ రామకృష్ణ లేఖ

జైన్ షాక్: జగన్‌ రివర్స్ టెండరింగ్ తడిసి మోపెడు