ఈనాడు అధినేత రామోజీరావు సారధ్యంలోని మార్గదర్శి ఫైనాన్స్‌ సంస్థకు చెందిన కుంభకోణం వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు నుంచి రామోజీరావును డిశ్చార్జ్ చేయడాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఈ కేసులో ఏపీ సర్కార్‌ను కూడా ప్రతివాదిగా చేర్చాలని సుప్రీం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఉండవల్లి ఢిల్లీలో మీడియాకు వెల్లడించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఏదో ఒక రకంగా స్టేలు తెచ్చుకుని ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ఈనాడు అధినేత ప్రయత్నిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు.

Also Read:ఒకరికొకరం గౌరవం ఇచ్చిపుచ్చుకునేవాళ్లం.. వైఎస్‌తో అలా, కానీ జగన్: చంద్రబాబు

కేసులో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రమే ప్రతివాదిగా చేర్చారని.. అయితే ఏపీని కూడా చేర్చాలన్న తమ విజ్ఞప్తిని సుప్రీం స్వీకరించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే వారు రూ.2,300 కోట్ల వసూలు చేశారని.. దీనిపై నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనపై కక్షగట్టారని ఆరోపిస్తూ.. రామోజీరావు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని.. రాజశేఖర్ రెడ్డి పేరును వాడటానికి వీల్లేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పేరు వాడాలని సూచించింది. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం స్టే విధించింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశామని.. తాను ఊహించిన దానికంటే సుప్రీం మంచి ఆదేశాలు ఇచ్చిందని ఉండవల్లి అన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని, నాటి విచారణాధికారి కృష్ణంరాజును ఈ పిటిషన్‌లో పార్టీలుగా చేర్చారని ఆయన తెలిపారు.

ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధంగా రామోజీరావు డిపాజిట్లు సేకరించారని.. డిపాజిట్లు వెనక్కి ఇచ్చామన్న క్లైమ్‌లో కూడా చాలా తప్పులు ఉన్నాయని అరుణ్ కుమార్ వెల్లడించారు.

డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనే పరిశీలనను కూడా అడ్డుకుంటున్నారని.. డిపాజిట్లు వెనక్కి ఇచ్చానని, చెప్పినంత మాత్రాన క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఆగిపోవని ఉండవల్లి తేల్చిచెప్పారు. ఈ కేసులో ట్రయల్ కోర్టులో నిబంధనల ప్రకారం విచారణ జరగాలని ఆయన కోరారు.

Also Read:మండలి రద్దు భయం వద్దు: ఎమ్మెల్సీలకు చంద్రబాబు భరోసా

అవిభక్త హిందూ కుటుంబ సంస్థ అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్, ఆర్‌బీఐ చట్టం-1934లోని సెక్షన్ 45 (ఎస్) నిబంధనను ఉల్లంఘించి డిపాజిట్లు వసూలు చేశారని ఉండవల్లి తెలిపారు.

కేసులో దోషిగా తేలితే, ఆర్‌బీఐ వసూలు చేసిన దానికి రెండున్నర రెట్లు జరిమానా (సుమారు 7 వేలకోట్లు) విధించే అవకాశం ఉందని.. దానితో పాటు రెండున్నరేళ్ల పాటు జైలుశిక్ష పడే సూచనలు కనిపిస్తున్నాయని అరుణ్ కుమార్ వెల్లడించారు.