ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీలకు భరోసానిచ్చారు. మండలి ఎట్టి పరిస్ధితుల్లోనూ రద్దు కాదని తెలిపారు. సభలో మొదటి రోజు మొత్తం తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆయన మండిపడ్డారు.

స్పీకర్‌కు స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసి ప్రతిపక్షాన్ని బయటకు నెట్టామన్నారని బాబు ఎద్దేవా చేశారు. కౌన్సిల్‌ గ్యాలరీలో కూర్చొన్న తనను బయటకు పంపించే ప్రయత్నం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలి ఛైర్మన్‌ను ఆయన రూంలోనే కొట్టేందుకు యత్నించారని చంద్రబాబు ఆరోపించారు.

తీవ్రవాద గ్రూప్‌ల నుంచి తీసుకువచ్చి సీతక్క, పోతుల సునీతకు టిక్కెట్లు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. పోతుల సునీతకు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని.. ఓడిపోతే ఎమ్మెల్సీని చేశామని, ఆమెకు ఎం తక్కువ చేశామని బాబు ప్రశ్నించారు.

మండలిలో మెజారిటీ ఉందని తమకు ముందే తెలుసునని, 9 మందితో గెలుస్తామని ఎలా అనుకున్నారని ఆయన అన్నారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేకపోతే మూడు రాజధానులు బిల్లు ఎందుకు పెట్టారని బాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. 

మండలిలో ప్రత్యక్ష ప్రసారాలు, లైవ్ కట్ చేశారని ఛైర్మన్ షరీఫ్‌ను బూతులు తిట్టారని, మంత్రి బొత్స ఏకంగా అంతు చూస్తానని బెదిరించారని చంద్రబాబు తెలిపారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని జనం ముక్తకంఠంతో నినదిస్తున్నారని అన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు.

మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రికి జనం గోడు వినిపించడం లేదన్నారు. అసెంబ్లీలో తమ వాదన వినిపించడానికి కనీసం సమయం ఇవ్వలేదని, రెండు గంటలైనా సమయం ఇవ్వాలని అడిగామని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

Also Read:ప్రాసెస్ పూర్తి కాలేదు, అప్పుడే సెలెక్ట్ కమిటీకి': టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

వైసీపీ నేతలు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మండలి ఛైర్మన్‌కు విచక్షణాధికారం ఉంటుందని.. సభలో మాట్లాడకుండా మైక్ కట్ చేశారని.. ఇంత సీరియస్ బిల్లుపై చర్చకు సమయం ఇవ్వరా అని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమైన బిల్లులపై లాభనష్టాలు చెప్పడం ప్రతిపక్షంగా తమ పని అని బాబు స్పష్టం చేశారు.

జగన్ ఉన్మాది ముఖ్యమంత్రని, అమరావతిలోనే రాజధాని ఉండాలని మేం కోరుకోవడం తప్పా అని టీడీపీ అధినేత ప్రశ్నించారు. అసెంబ్లీ నుంచి మా సభ్యులను ఏకపక్షంగా సస్పెండ్ చేశారని, తమపై 70 మంది వైసీపీ సభ్యులు దాడికి యత్నించారని చంద్రబాబు ఆరోపించారు.

Also Read:ఢిల్లీ బీజేపీ ఆఫీ‌స్‌లో సినీ నటుడు అలీ: జగన్‌కు షాకిస్తారా?

అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత తనను, మా సభ్యులను డొంకరోడ్లతో గంటల పాటు తిప్పారని దుయ్యబట్టారు. మండలి ఛైర్మన్‌పై 22 మంది మంత్రులు ఒత్తిడి తీసుకొచ్చారని.. సభలో తాను లేచినప్పుడు వైఎస్ కూర్చునేవారని గుర్తుచేశారు.

ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారని.. మీడియా స్వేచ్ఛను సైతం జగన్ ప్రభుత్వం హరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. శాసనమండలి లైవ్ ప్రసారాలను కట్ చేశారని చంద్రబాబు తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను, ఉద్ధండులైన రాజకీయ నాయకులను చూశానని కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదన్నారు.