ముఖ్యమంత్రి చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు. ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ‘‘వంచనపై గర్జన దీక్ష’’లో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. ఇద్దరు కలిస్తే హోదా వస్తుందని చెప్పారని కానీ ప్రత్యేకహోదా రాలేదని ఎద్దేవా చేశారు.

సీఎం తన అసమర్థతను ఒప్పుకుని.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా విషయంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని.. దీని గురించి ఆయనపై పీడీ యాక్ట్ పెట్టాలని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. రైతులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు సహా అన్ని వర్గాలను చంద్రబాబు వంచించారని ఆరోపించారు. ఆనాడు ఎంపీలందరూ రాజీనామా చేద్దామంటే టీడీపీ ఒప్పుకోలేదన్నారు. తమ అధినేత వైఎస్ జగన్ నాలుగేళ్లుగా ప్రత్యేకహోదా కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.