ఎంఎల్ఏ కనబడటం లేదు

First Published 16, Dec 2017, 7:21 AM IST
Udayagiri mla plays hide and seek with maha police
Highlights
  • నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపి ఎంఎల్ఏ బొల్లినేని వెంకటరామారావు కనబడటం లేదట.

నెల్లూరు జిల్లా ఉదయగిరి టిడిపి ఎంఎల్ఏ బొల్లినేని వెంకటరామారావు కనబడటం లేదట. అదేంటి ఎంఎల్ఏ కనబడటం లేదని ఆశ్చర్యపోతున్నారా? అధికారపార్టీ ఎంఎల్ఏ కదా అప్పుడప్పుడు అవసరానికి అలా మాయమైపోతుంటారు లేండి. ఇంతకీ విషయం ఏమిటంటే, మహారాష్ట్రలోని విదర్భ ఇరిగేషన్ కార్పొరేషన్ కాంట్రాక్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగింది. జరిగిన అవినీతి కూడా బొల్లినేని కంపెనీలోనే. అంటే సాక్ష్యాత్తు ఎంఎల్ఏ కంపెనీనే అక్కడ పనులు చేసి అవినీతికి పాల్పడింది. ఆ విషయం సాక్ష్యాధారాలతో సహా బయటపడింది. వెంటనే ప్రభుత్వం ఏసిబితో విచారణ చేయించి అవినీతి జరిగినట్లు నిర్ధారణకు వచ్చింది. దాంతో కంపెనీతో పాటు ఎంఎల్ఏపైన కూడా కేసులు నమోదు చేసింది.

ఇదంత చరిత్ర. అంటే దాదాపు నాలుగు మాసాల క్రితం జరిగిన విషయం. అయితే, తాజా పరిస్దితి ఏంటంటే, అవినీతి అవినీతిని మరింత లోతుగా విచారించిన ఏసిబి కొత్తగా మరో రెండు కేసులు నమోదు చేసింది. కేసుల విచారణలో భాగంగా ఎంఎల్ఏను అరెస్టు కూడా తప్పదు. ఇక్కడే ఎంఎల్ఏ ఎలర్ట్ అయ్యారు. ఎంతైనా అదికారపార్టీ ఎంఎల్ఏ కదా? తన పరపతిని మొత్తం ఉపయోగించుకుంటున్నారు.

ఎందుకంటే, ఎంత మహారాష్ట్ర ఏసిబి అయినా నెల్లూరు లేదా ఉదయగిరికి వచ్చినపుడు సహకరించాల్సింది లోకల్ పోలీసులే కదా? లోకల్ పోలీసుల సహకారం లేందే బయటనుండి వచ్చిన వారు ఎంతటి ఉన్నతస్ధాయి అధికారులైనా ఏమీ చేయలేరు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఎంఎల్ఏను అరెస్టు చేద్దామని గతంలోనే ఏసిబి పోలీసులు నెల్లూరు, ఉదయగిరికి వచ్చారు. ఎంత వెతికినా ఎంఎల్ఏ కనిపించలేదు. పోనీ ఫోన్ చేద్దామంటే స్విచ్చాఫ్ అనివస్తోంది. ఎన్ని రోజులైనా అదే పరిస్ధితి. దాంతో చేసేది లేక ఏసిబి అధికారులు వెళ్ళిపోయారు.

మళ్ళీ తాజాగా అరెస్టు వారెంటుతో ఏ క్షణంలో అయినా రావచ్చన్నది సమాచారం. ఎవరొస్తే మాత్రం ఏంటట ? ఎంఎల్ఏ మళ్ళీ కనబడరంతే. ఎందుకంటే, ఆయన అధికారపార్టీ ఎంఎల్ఏ కాబట్టే. ఇంతకీ  ఎంఎల్ఏ నిజంగానే కనబడటం లేదా? అదేం లేదులేండి. పార్టీ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటునే ఉన్నారట. అధికార కార్యక్రమాల్లోనూ దర్శనం ఇస్తూనే ఉన్నారట. అరెస్టు అనేటప్పటికి మాత్రం పోలీసులకు కనబడటం లేదట. అదే టిడిపి ఎంఎల్ఏ కాకుండా వైసిపి ఎంఎల్ఏ అయ్యుంటే ఎలాగుండేది పరిస్ధితి?

 

 

 

 

loader