ఆర్కె నగర్ ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. తమిళనాడు వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠకు గురిచేసిన ఉపఎన్నికలో ప్రెషర్ కుక్కర్లో రెండాకులు ఉడికిపోయింది. కుక్కర్ దెబ్బకు ఉదయించే సూర్యుడు కూడా వెలుగులు విరజిమ్మలేకపోయాడు. 7వ రౌండ్ అయ్యేటప్పటికి వెల్లడైన ఫలితాల ప్రకారం స్వతంత్ర అభ్యర్ధి టిటివి దినకరన్ గెలిచేసినట్లే. సమీప ఏఐఏడిఎంకె అభ్యర్ధి మధుసూదనన్ పై దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీ సాధించారు. టిటివికి 39, 548 ఓట్లు, ఏఐఏడిఎంకె కు 19,526, డిఎంకెకి 10292 ఓట్లు వచ్చాయి.

ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా తామే గెలిచేస్తామని, తమిళనాడు ప్రజలు, ఆర్కె నగర్ ఓటర్లు తమకే పట్టం కడతారని చెప్పుకున్న డిఎంకె అభ్యర్ధి మరుతు గణేష్ మూడో స్ధానంతో సరిపెట్టుకోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికార, ప్రధాన ప్రతిపక్షాల పరిస్ధితే ఇలాగుంటే ఇక, భారతీయ జనతా పార్టీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. భాజపాకు వచ్చిన ఓట్లకన్నా నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువంటే ఆ పార్టీ పరిస్దితి ఏంటో స్పష్టమైపోతోంది.

ఆర్కె నగర్ ఉపఎన్నిక కొన్ని సంకేతాలు ఇచ్చినట్లైంది. మొదటిది తమిళనాడు ప్రజలు కేంద్రంలోని భాజపా జోక్యాన్ని ఏమాత్రం సహించటం లేదన్నది అర్దమవుతోంది. ఇక రెండో విషయం ఏంటంటే, జయలలిత మృతికి శశికళే ప్రధాన కారణమన్న ప్రచారాన్ని ఓటర్లు ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. జయలలిత వారసులుగా ముఖ్యమంత్రి పళని స్వామి, పన్నీర్ శెల్వం కన్నా శశికళ-టిటివి దినకర్ వైపే మొగ్గు చూపుతున్నట్లు అర్ధమైంది. అదే సందర్భంలో ఏఐఏడిఎంకె నాయకత్వానికి కూడా శశికళ-దినకరన్ కే అర్హతలున్నట్లు కూడా జనాలు తీర్పు చెప్పినట్లైంది. ఏదేమైనా ఓటర్ల తీర్పు మాత్రం విలక్షణంగా ఉందనే చెప్పాలి.