Case Registered Against Jagan: చీలి సింగయ్య మరణం కేసులో నిందితులుగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. జగన్ సహా పలువురు మాజీ మంత్రులపై కూడా నమోదు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు.
YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మరో కేసు నమోదైంది. జూన్ 18న పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో ఓ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్నారు. అలాగే, సత్తెనపల్లిలో ఒక విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఉంది. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం వద్ద భారీగా జనం గుమిగూడడంతో దుర్ఘటన చోటు చేసుకుంది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
వైకాపా కార్యకర్త సింగయ్య మరణం
వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్త చీలి సింగయ్య, జగన్ మోహన్ రెడ్డికి పుష్పగుచ్ఛాలు అందించేందుకు వాహనం వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ జరిగిన తొక్కిసలాటలో అతను జారి పడిపోయాడు. దీంతో జగన్ ప్రయాణిస్తున్న ఫార్చూనర్ వాహనం టైర్లు అతని పై నుంచి వెళ్ళినట్లు వీడియో ఫుటేజ్ ద్వారా తెలుస్తోంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
జగన్, పేర్ని నాని, విడుదల రజినిలపై కేసు నమోదు.. కొనసాగుతున్న విచారణ
ముందుగా గుర్తించలేని వాహనం ఢీకొట్టినట్లు కేసు నమోదుచేశారు. అయితే, సీసీటీవీ, డ్రోన్ల ద్వారా తీసిన విజువల్స్, ప్రత్యక్ష సాక్షుల వీడియోల ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, "జగన్ ప్రయాణిస్తున్న వాహనమే సింగయ్యను తొక్కిందని స్పష్టంగా కనిపించింది. అందువల్ల జగన్, డ్రైవర్ రమణా రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజినిలపై కేసు నమోదు చేశాము" అని చెప్పారు.
కేసు నమోదు వివరాలు
సింగయ్య భార్య ఫిర్యాదుతో మొదట కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ అనంతరం కేసులో సెక్షన్లు మార్చారు. భారత్ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 (అజాగ్రత్త వలన మరణం), సెక్షన్ 49ల కింద కేసు నమోదు చేశారు. అధికారిక అనుమతి ఉన్న వాహనాలు కేవలం 14 ఉండగా, కాన్వాయ్‌లో 50కి పైగా వాహనాలు పాల్గొన్నట్లు ఎస్పీ వెల్లడించారు.
ఈ సంఘటనపై విచారణ ఇంకా కొనసాగుతుండగా, పోలీసులు అన్ని ఆధారాల ఆధారంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగిస్తామని తెలిపారు. రాజకీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.
