జెసి బ్రదర్స్ కు గడ్డు కాలమేనా ?

Tough time ahead for JC brothers
Highlights

ఇన్ని వ్యతిరేకపవనాలు వీస్తున్న దశలో వచ్చే ఎన్నికల్లో ‘అసలు’కే ఎసరొచ్చే పరిస్ధితిల్లో ఇక ‘కొసరు’ గురించి ఆలోచించటం ఎలాగన్నా బాధ వీరిని ఎక్కువగా వేధిస్తున్నది.

వచ్చే ఎన్నికల నాటికి జెసి బ్రదర్స్ కు రాజకీయంగా గడ్డు పరిస్ధితులు తప్పవనిపిస్తోంది. ఇంటి, బయటా పరిస్ధితులు వారికి వ్యతరేకంగా మారుతుండటమే కారణాలు. దాంతో వచ్చే ఎన్నికల్లో జెసి బ్రదర్స్ కు ఎదురుదెబ్బ తప్పదని అంచనా వేస్తున్నారు. ఈ విషయాలను బ్రదర్స్ కూడా గమనిస్తున్నారు. అందుకనే వారిలో అసహనం పెరిగిపోతోంది.

 

అనంతపురం జిల్లా రాజకీయసమీకరణలను మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది తాడిపత్రి నియోజకవర్గం, రెండోది అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం కాగా మూడోది జిల్లా రాజకీయాలు. గడచిన రెండున్నర సంవత్సరాలుగా జెసి బ్రదర్స్ తీరుతో చాలా వర్గాలు విసిగిపోయాయనే చెబుతున్నారు. దాంతో అవన్నీ వ్యతిరేకంగా మారుతుండటం గమనార్హం.

 

మొదటిదైన తాడిపత్రినే తీసుకుంటే, దశాబ్దాల తరబడి జెసి కుటుంబానికి తాడిప్రతి పెద్ద అండగా నిలుస్తోంది. నియోజకవర్గంలోని రెడ్డి సామాజికవర్గం మొత్తం జెసిలకు మద్దతుగా నిలబడ్డారు. కాబట్టే జెసిలు బలవంతులయ్యారు. అయితే, మారిన పరిస్ధితుల కారణంగా తాడిపత్రి ఇన్ఛార్జ్ గా వైసీపీ తరపున నియోజకవర్గం మొత్తం మీద బాగా పట్టున్న పెద్దారెడ్డి నియమితులయ్యారు. దాంతో జెసి బ్రదర్స్ కు ఇబ్బందులు మొదలయ్యాయి. ఎందుకంటే, నియోజకవర్గం మొత్తం మీద పెద్దారెడ్డికి బంధువర్గం, అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇపుడు వారంతా వైసీపీకి మద్దతుగా నిలిచారు. 

 

ఇక అనంతపురం నియోజకవర్గంలో కూడా పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీలేవు. ఎందుకంటే, జెసి దివాకర్ రెడ్డి ఎంపిగా గెలిచినప్పటి నుండి వివిధ వర్గాలతో గొడవలు పెట్టుకుంటూనే ఉన్నారు. ప్రధానంగా అనంతపురం టిడిపి ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరితో ఉప్పు-నిప్పుగా తయారైంది. పోయినసారే పార్టీ తరపున కమ్మ సామాజికవర్గం తప్పని పరిస్ధితుల్లో జెసికి ఓట్లు వేసారు. ఈసారి జెసి మళ్ళీ నిలబడినా ఓట్లేసే పరిస్ధితులు కనబడటం లేదు. దానికితోడు రెడ్లతో కూడా జెసి వైరం పెంచుకుంటున్నారు.

 

మూడోదైన జిల్లా సమీకరణలూ వ్యతిరేకంగానే ఉన్నాయి. ప్రతిపక్ష వైసీపీ బలంగా ఉంది. ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ప్రబలుతోంది. దానికితోడు టిడిపిలోని దాదాపు అన్నీ వర్గాలూ జెసి బ్రదర్స్ కు వ్యతిరేకంగా తయారయ్యాయి. తాజాగా పవన్ను విమర్శించటం ద్వారా కాపు సామాజిక వర్గాన్ని కూడా జెసి దూరం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనే అనంతపురం, తాడిపత్రి నియోకవర్గాల్లో తమ వారసులను తెరపైకి తీసుకురవాలన్నా కోరిక జెసి బ్రదర్సలో బలంగా కనబడుతోంది.

 

ఇన్ని వ్యతిరేకపవనాలు వీస్తున్న దశలో వచ్చే ఎన్నికల్లో ‘అసలు’కే ఎసరొచ్చే పరిస్ధితిల్లో ఇక ‘కొసరు’ గురించి ఆలోచించటం ఎలాగన్నా బాధ వీరిని ఎక్కువగా వేధిస్తున్నది. జగన్ పై జెసి దివాకర్ రెడ్డి చేస్తున్నవివాదాస్పద వ్యాఖ్యల పుణ్యమా అని వైసీపీ తలుపులు కూడా మూసుకునోయినట్లే. అదే సందర్భంలో ఆదాయవనరైన ట్రావెల్స్ కు తెలంగాణాలో ఇబ్బందులు తలెత్తినట్లు కనబడుతోంది. ఇంటా, బయటా ముసురుకుంటున్న సమస్యల కారణంగా జెసి బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బందులు మొదలైనట్లే కనబడుతోంది.

loader