ఆంధ్ర ప్రదేశ్ పాలనా వికేంద్రరణ, సీఆర్డిఏ రద్దు చట్టాల ఉపసంహరణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు (CRDA Cancellation) చట్టాల ఉపసంహరణపై ఇవాళ(సోమవారం) ఏపీ హైకోర్టు (ap high court)లో విచారణ జరగనుంది. మూడు రాజధానుల (three capitals) చట్టంతో పాటు సీఆర్డిఏ రద్దు చట్టాన్ని కూడా నవంబర్ 22న ఉపసంహరించుకొన్నట్టుగా హైకోర్టుకు తెలుపుతూ ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అఫిడవిట్ కూడా దాఖలుచేసింది. చట్ట సభలో ప్రవేశపెట్టిన రద్దు బిల్లులకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలిపారని... దీంతో ఆ బిల్లులు చట్టరూపం దాల్చాయని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకి నివేదించింది.

ఇప్పటికే అమరావతి (amaravati) రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కృష్ణా రైట్ ఫ్లడ్ బ్యాంక్ బండ్ విస్తరణ, బలోపేతం ప్రాజెక్టును చేపట్టామని... ఇందుకోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైకోర్టు అదనపు భవనాన్ని నిర్మిస్తున్నామంటూ ప్రభుత్వం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. 

ఇవాళ ఈ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ఉపసంహరణపై హైకోర్టు విచారించనుంది. విచారణ అనంతరం హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందోనని అటు రాజధాని రైతులు, ఇటు వైసిపి ప్రభుత్వమే కాదు యావత్ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More రాజధాని వికేంద్రీకరణ తథ్యం.. అమరావతి కూడా వుంటుంది: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

ఇప్పటికే మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ అఫిడవిట్‍కు అనుబంధంగా కొత్తగా తెచ్చిన బిల్లులను హైకోర్టుకు సమర్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇప్పటికీ అభివృద్ధి వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానుల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. అందుకు అనుగుణంగా సమగ్ర మార్పులు తీసుకొచ్చేందుకే ఈ బిల్లులు ఉపసంహరించుకున్నామని ప్రభుత్వం వెల్లడించింది.చట్టం రద్దు ద్వారా సీఆర్డీఏను పునరుద్ధరించామని.. శ్రీబాగ్ ఒప్పందాన్నిసైతం ప్రస్తావించింది. 

మరోవైపు శ్రీబాగ్ ఒప్పందానికి చట్టబద్ధత, న్యాయబద్ధత లేదంటున్నారు రైతుల తరపు న్యాయవాదులు. చట్టాలను వెనక్కి తీసుకున్నా మళ్లీ బిల్లు పెడతామనడంపై రాజధాని పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ వాదనలకు సిద్ధమవుతున్నారు న్యాయవాదులు. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‍లో ఉన్న బిల్లులను అధ్యయనం చేస్తున్నారు. 

ఏపీ పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ఏపీ హూకోర్టులో (AP High court) వికేంద్రీకరణ, సీఆర్డిఏ రద్దు చట్టాల ఉపసంహరణపై అఫిడవిట్ ఇచ్చారు. మూడు రాజధానుల (Three capitals) చట్టం ఉపసంహరణ గురించి కూడా వివరించారు. వికేంద్రీకరణ చట్టం రద్దు బిల్లును చట్టసభల్లో ఆమోదించినందున తగు ఉత్తర్వులు ఇవ్వాలని ఆ ఆఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం కోరింది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ది బిల్లు-2020 , ఏపీ సీఆర్‌డీఏ రద్దు -2020 బిల్లులకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ 2020 జూలై 31న ఆమోదం తెలిపారు. శాసనమండలికి రెండు దఫాలు పంపిన తర్వాత నెల రోజుల గడువు పూర్తైతే అలాంటి బిల్లులు ఆమోదం పొందినట్టే పరిగణించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం ఇటీవల ఈ మూడు బిల్లులను ఆమోదానికి పంపింది. దీంతో గవర్నర్ ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపారు.