తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారించనుంది.  

హైదరాబాద్ : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ పై ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు విచారణ జరపనుంది. తమ సొంత కంపనీతో పాటు టిడిపి నాయకులకు లబ్ది చేకూర్చేందుకు రింగ్ రోడ్డు చంద్రబాబు అలైన్ మెంట్ లో మార్పులు చేసారని వైసిపి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంపై సిఐడితో విచారణ చేయిస్తున్న జగన్ సర్కార్ చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ పైనా కేసు నమోదు చేసారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా వుండేందుకు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలుచేసిన పిటిషన్ పై ఇవాళ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారించనుంది.

ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటికే చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ కోసం చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేయగా దాన్ని హైకోర్టులో కొట్టేసింది. అరెస్ట్ కాకుండానే సాధారణ బెయిల్ పై విచారణ జరపలేమంటూ ఆ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో చంద్రబాబు లాయర్లు ముందస్తు బెయిల్ కోసం మరో పిటిషన్ ను దాఖలు చేసారు. నేడు ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించనుంది. 

ఇక ఇదే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును విచారించేందుకు విజయవాడ ఏసిబి కోర్టులో పిటి వారెంట్స్ దాఖలుచేసింది సిఐడి. దీనిపై ఇవాళ ఏసిబి కోర్టులో విచారణ జరగనుంది. 

Read More Vijayasai Reddy : లోకేష్ కు ఆ వ్యాధి సోకిందా?: విజయసాయి రెడ్డి సంచలనం

ఇదిలావుంటే స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలుచేసిన రిట్ పిటిషన్ పై నేడు ఏపి హైకోర్టు విచరణ జరపనుంది. ఇప్పటికే ఈ స్కిల్ కేసును సీబీఐ విచారణకు ఇవ్వడంపై తమకెలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం, సిఐడి తరపన అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలనీ హైకోర్టు ఆదేశించింది. 

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరుచేస్తూ ఏపీ హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై సిఐడి అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిఐడి పిటిషన్ పై నిన్న(మంగళవారం) విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబు పార్టీ వ్యవహారాలు చూసుకోవచ్చని... రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాల్లో పాల్గొనవచ్చిన సుప్రీంకోర్టు సూచించింది. కానీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని సూచించింది. సిఐడి అధికారులు కూడా ఈ కేసు గురించి మాట్లాడవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. 

రెగ్యులర్ బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి దాఖలుచేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలుచేయాలని చంద్రబాబును సుప్రీంకోర్టు ఆదేశించింది. వచ్చే నెల 8వ తేదీలోపు కౌంటర్ దాయలుచేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు సూచించింది.