సారాంశం

యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించిన టిడిపి నేత నారా లోకేష్ పై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సెటైర్లు వేసారు. పశువులకు సోకే బ్లూటంగ్ వ్యాధి  లోకేష్ కు ఏమైనా సోకిందేమో అంటూ మండిపడ్డారు. 

అమరావతి : తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో ఆగిపోయిన యువగళం పాదయాత్రను నారా లోకేష్ తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైసిపి ప్రభుత్వంపై లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో తాజాగా లోకేష్ కు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్ వేదికన కౌంటర్ ఇచ్చారు.  

''ఎవరు నడవమన్నారో, ఎందుకు పెట్టుకున్నారో యువగళం యాత్ర.నడక భారమై బిత్తర సవాళ్లు విసురుతున్నారు లోకేశ్ గారు. గాలికుంటు, బ్లూ టంగ్ వ్యాధులేమైనా సోకి నాలుక వాచిందేమో టెస్ట్ చేయించుకోండి చినబాబు. ఛాలెంజికి కూడా ఒక స్థాయి ఉండాలి'' అంటూ లోకేష్ పై సెటైరికల్ గా ట్వీట్ చేసారు విజయసాయి రెడ్డి. 

ఇక లోకేష్ యువగళం పాదయాత్రపై మంత్రి అంబటి రాంబాబు కూడా సెటైర్లే వేసారు. ఆగిపోయిన హాస్య భరిత చిత్రం మళ్లీ ప్రారంభమయ్యింది... ఇది యువగళం కాదు క్యామిడీ గళం అంటారేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు లోకేశ్ ఈ యాత్రను ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు ఆపేశారో.. మళ్లీ ఎందుకు మొదలుపెడుతున్నారో తెలియడం లేదన్నారు. అసలు పుత్రుడు చేసే కామెడీ రేపటి నుంచి చూడొచ్చంటూ రాంబాబు సెటైర్లు వేశారు. 

Read More  Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ ... నేడు సుప్రీం నిర్ణయంపై ఉత్కంఠ

ఇదిలావుంటే రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర తిరిగి ప్రారంభించిన లోకేష్ తాటిపాక సెంటర్లో చేపట్టిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమపై ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసుల్లో ఇరికించినా భయపడబోమని అన్నారు. మరో మూడు నెలల్లో టిడిపి అధికారంలోకి రానుందని... అప్పుడు మేమేంటో చూపిస్తామని హెచ్చరించారు. టిడిపి నాయకులు, కార్యకర్తలను వేధించిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని... వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు. రాజోలు నుండి రష్యాకు పారిపోయినా వెనక్కి లాక్కువచ్చి జైల్లో పెడతామని హెచ్చరించారు. తన తాత ఎన్టీఆర్ ఇచ్చిన గొంతును ఆపే మగాడు పుట్టలేదు... పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే దండయాత్ర చేయాల్సి వస్తుందంటూ వైసిపి నాయకులను లోకేష్ హెచ్చరించారు.