తిరుమల శేషాచలం అడవుల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు అంతకంతకు వ్యాపించి ప్రమాదకరంగా మారాయి. వెంటనే స్సందించిన అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడి మంటలను అదుపుచేసారు.  

Tirumala : తిరుమల పరిధిలోని శేషాచలం అడవుల్లో కార్చిచ్చు రగులుకుంది. పాపవినాశనం సమీపంలోని తుంబూరు తీర్థం సమీపంలో మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపుచేసే ప్రయత్నాలు చేసారు. అయితే రాత్రి సమయంలో అడవిలోకి వెళ్లడం, మంటలను అదుపుచేయడం కాస్త కష్టతరం అయ్యింది. అయినా ఎలాగోలా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. 

తెలంగాణ టు తిరుపతి రైలు రద్దు :

తెలంగాణ నుండి తిరుపతికి వెళ్లే రైలు రద్దయ్యింది. కరీంనగర్-తిరుపతి రైలు వచ్చేనెల జూన్ నుండి అందుబాటులో ఉండదని రైల్వే శాఖ ప్రకటించింది. వారానిరి రెండుసార్లు నడిచే ఈ రైలు ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి రైలు రద్దు కావడంతో తిరుమలకు వెళ్లే భక్తులు ఇబ్బందిపడే అవకాశాలున్నాయి.

తిరుమలలో దర్శన వేళలు మార్పులు : 

గత వైసిపి ప్రభుత్వం తిరుమలలో దర్శన వేళల్లో మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. విఐపి బ్రేక్ దర్శనాలు తెల్లవారుజామున ఉండగా దాన్ని ఉదయం 10 గంటలకు మార్చారు. తాజాగా కూటమి ప్రభుత్వం గతంలో మాదిరిగానే తెల్లవారుజామున విఐపి బ్రేక్ దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈమేరకు కొత్త దర్శన వేళలను ప్రకటించారు... ఇవాళ్టి నుండి ఇది అమల్లోకి రానుంది. 

తెల్లవారుజామున 5.45 గంటలకు ప్రోటోకాల్, 6.30 గంటలకు రెఫరల్ ప్రోటోకాల్ దర్శనాలు కల్పించనున్నారు. ఇక ఉదయం 6.45 కు జనరల్ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. ఇలా ఉదయం 7.30 గంటలలోపు బ్రేక్ దర్శనాలు పూర్తిచేయడం ద్వారా రోజంతా సామాన్య భక్తులు ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా దర్శనం కల్పించవచ్చనేది టిటిడి ఆలోచన. 

ఇక ఉదయం 10 గంటల తర్వాత మరోసారి బ్రేక్ దర్శనాలను కల్పించనున్నారు. ఉదయం 10.15 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ దాతలకు దర్శనం కల్పిస్తారు. ఉదయం 10.30 గంటలకు ఇతర దాతలు, ఉదయం 11 గంటలకు టిటిడి రిటైర్డ్ ఉద్యోగులకు దర్శనం కల్పిస్తారు. ఈ దర్శనవేళలను భక్తులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.