తిరుమల స్వామి వారి దివ్య దర్శనం టోకెన్లు ఇక అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్‌ నుంచే జారీ అవుతాయని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులు ఆధార్ కార్డు స్కానింగ్‌ చేయించుకోవడం తప్పనిసరని పేర్కొన్నారు.

తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనం కోసం ప్రతిరోజూ వేలాది మంది భక్తులు తరలి వెళ్తుంటారు. వారిలో ఎక్కువ మంది స్వామి వారి దివ్య దర్శనానికి వస్తుంటారు. వారందరికీ టీటీడీ ఇప్పుడు ఓ అదిరిపోయే వార్తను వినిపించింది.కానీ ఇప్పుడు దివ్య దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియలో టీటీడీ కీలక మార్పులు చేసింది.

ఇప్పటివరకు శ్రీవారి మెట్టు వద్ద భక్తులకు టోకెన్లు అందించేవారు. కానీ ఈ కౌంటర్లను తాత్కాలికంగా అక్కడినుంచి షిఫ్ట్ చేస్తున్నారు. జూన్ 6వ తేదీ సాయంత్రం నుంచి దివ్య దర్శనం టోకెన్లు తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లోనే జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

యాత్రలో అవాంతరాలు…

ఈ మార్పుతో భక్తులు ముందుగానే సమాచారం తెలుసుకుని తమ యాత్రలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలని టీటీడీ (TTD) సూచిస్తోంది. శుక్రవారం సాయంత్రం నుంచే ఈ కొత్త కౌంటర్లు అందుబాటులోకి రానున్నాయి. టోకెన్లు పొందాలంటే భక్తులు తమ ఆధార్ కార్డుతో పాటు భూదేవి కాంప్లెక్స్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

ముందుగా వచ్చిన వారికి..

దివ్యదర్శనం టోకెన్లు పరిమిత సంఖ్యలో ఉంటాయి. అందుకే ముందుగా వచ్చిన వారికి ముందు టోకెన్లు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం దర్శనం కోసం శుక్రవారం సాయంత్రమే టోకెన్లు ఇస్తారు.భక్తులు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా దివ్య దర్శనం చేసుకోవాలంటే, 1,200వ మెట్టు వద్ద టోకెన్‌ను తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలి. స్కానింగ్ చేయకపోతే వారికి దర్శనానికి అనుమతి ఉండదు. ఇది కచ్చితమైన నిబంధనగా టీటీడీ స్పష్టం చేసింది.

సర్వదర్శన టోకెన్లను కూడా…

కేవలం దివ్య దర్శనానికి మాత్రమే కాకుండా, సాధారణ సర్వదర్శన టోకెన్లను కూడా భూదేవి కాంప్లెక్స్‌లోనే ఇవ్వనున్నట్లు టీటీడీ ప్రకటించింది.ఈ మార్పులు భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పటికీ, ముందుగానే సమాచారం తెలిసి రావడం వల్ల అనవసరమైన తొక్కిసలాటలు నివారించవచ్చు.