తిరుపతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎదుర్కునేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోకసభకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. దీంతో తిరుపతి నుంచి తామే పోటీ చేయాలని పవన్ కల్యాణ్ పట్టుబడుతున్నారు. అయితే, తిరుపతిని వదులుకోవడానికి బిజెపి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు. అయితే, ఇరు పార్టీలు సమన్వయంతో ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దించాలని మాత్రం చూస్తున్నాయి.

లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీపై చర్చించేందుకు మిత్రపక్ష పార్టీలైన బీజేపీ, జనసేన పార్టీలు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమయ్యాయి. బీజేపీ తరఫున పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సతీష్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్‌ దియోధర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీలు పాల్గొన్నారు. జనసేన నుంచి పవన్‌కల్యాణ్, నాదెండ్ల మనోహర్‌లు హాజరయ్యారు. 

Also Read: ఎన్టీఆర్, చిరంజీవిల సెంటిమెంట్: పవన్ కల్యాణ్ చేసిన తప్పు అదేనా?.

తిరుపతిలో ఎవరు పోటీ చేయాలనే దానిపై సమావేశంలో ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే బీజేపీ, జనసేన కలసి పోటీ చేసే విషయాన్ని మాత్రం బాగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా ఎవరు పోటీ చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని పవన్‌కల్యాణ్‌ అన్నట్లు సమాచారం.

Also Read: పవన్‌కు షాక్, తిరుపతి బరిలో బీజేపీయే : సోము వీర్రాజు వ్యాఖ్యలు

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మద్దతు ఇచ్చినందుకు బిజెపి తమకు తిరుపతి లోకసభ సీటును వదిలేయాలని పవన్ కల్యాణ్ కోరుతున్నారు.  జగన్ ను ఎదుర్కోవడానికి సిద్ధపడిన పవన్ కల్యాణ్ తిరుపతి సీటు విషయంలో తన పట్టును బిగించాలని చూస్తున్నారు.  బిజెపిని కాదని పవన్ కల్యాణ్ తన పార్టీ అభ్యర్థిని పోటీకి దించకపోవచ్చు. చివరగా, బిజెపి పెద్దలు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.