తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధే పోటీ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. శనివారం తిరుపతిలో నిర్వహించిన శోభాయాత్ర సందర్భంగా సోము ఈ ప్రకటన చేశారు.

ఎంపీ అభ్యర్ధిపై బీజేపీ, జనసేన కమిటీ చర్చిస్తుండగాన వీర్రాజు ఈ ప్రకటన చేశారు. జనసేన బలపరిచిన బీజేపీ అభ్యర్ధికి ఓటేయ్యాలని ఆయన పిలుపునిచ్చారు.

చంద్రబాబుకు నలుగురు ఎంపీలున్నా పని లేదని, జగన్‌కు 22 మంది ఎంపీలున్నా ఉపయోగం లేదన్నారు. తిరుపతిలో బీజేపీ గెలిస్తే స్వర్ణమయం చేస్తామని వీర్రాజు హామీ ఇచ్చారు. 

ఉపఎన్నిక గురించి బీజేపీ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చకపోవడం.. ఇటు పవన్‌ సైతం జనసేన తరపున అభ్యర్థిని  బరిలో దించాలని పట్టుదలగా ఉండటంతో ఒకింత ప్రతిష్ఠంభన నెలకొందనేది కమలనాథులు చెప్పేమాట. కొందరు బీజేపీ నాయకులకు ఈ పరిణామాలు రుచించడం లేదని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి డిపాజిట్‌ దక్కలేదు.

ఇప్పుడు జరగబోయే ఉపఎన్నికలో గెలుపోటములు పక్కన పెడితే  ఏపీలో పార్టీ బలోపేతానికి మంచి అవకాశంగా భావిస్తున్నారు సోము వీర్రాజు. మరి ఆయన వ్యాఖ్యలపై జనసేన వైపు నుంచి ఎలాంటి కామెంట్లు వినిపిస్తాయో వేచి చూడాల్సిందే.