అమరావతి : దివంగత నేత ఎన్టీ.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన అనంతరం తిరుపతి నుండి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి విజయం సాధించారు. తమ ఎమ్మెల్యే ఎన్టీఆర్‍ అని సంబరపడ్డారు. తిరుపతి బాగా అభివృద్ది చెందుతుందని ఆశపడ్డారు. వారి ఆశలు నెరవేరలేదు. 

ఎన్టీఆర్‍ తిరుపతి ఎమ్మెల్యేగా రాజీనామాచేశారు. గుడివాడ నియోజకవర్గం నుంచే తాను శాసనసభకు ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకుని ఆ పని చేశారు. ఎన్టీఆర్‍ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంపై తిరుపతి ఓటర్లు ఆగ్రహం చెంది 1985,89లలో టిడిపి అభ్యర్ధులను ఓడించారు. 

అదే విధంగా 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున చిరంజీవి ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆయన పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. తమ ఎమ్మెల్యే చిరంజీవి కావడంతో తిరుపతి బాగా అభివృద్ది చెందుతుందని ఆశపడ్డారు. అది కూడా నెరవేరలేదు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‍లో విలీనం చేసి చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అయ్యారు. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత జరిగిన ఎన్నికలలో వైసిపి తరపున పోటీ చేసిన టీటిడి మాజీ ఛైర్మన్‍ కరుణాకర్‍ రెడ్డి విజయం సాధించారు.ఎన్టీఆర్‍, చిరంజీవి ప్రజల సెంటిమెంటును పట్టించుకుని తిరుపతి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే తిరిగి విజయం సాధించి ఉండేవారని అభిప్రాయపడుతున్నారు. 

తిరుపతి నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేసి ఉంటే తప్పకుండా విజయం సాధించి ఉండేవారని అంటున్నారు.తిరుపతి సెంటిమెంటును దృష్టిలో పెట్టుకోకుండా.. భీమవరం, గాజువాకలలో పోటీ చేసి పవన్‍ కళ్యాణ్‍ ఓడిపోయి అప్రతిష్ట పాలయ్యారు. అదే తిరుపతి నుండి ఎమ్మెల్యేగా పవన్‍ పోటీ చేసినట్లుయితే పరిస్థితి మరోలా ఉండేదేమోనని భావిస్తున్నారు. 

ఎన్టీఆర్‍, చిరంజీవిల సెంటిమెంటు విషయం పవన్‍ కళ్యాణ్‍ దృష్ట్టికి తిరుపతి జనసేన నాయకులు తీసుకెళ్లినట్లయితే పరిస్థితి మరోలా ఉండేదని సమాచారం.  తిరుపతిలో ఎన్టీఆర్‍కు బ్రహ్మరధం పట్టినా.. చిరంజీవిని ఎమ్మెల్యేగా గెలిపించినా.. వారిద్దరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటంతో ఇప్పటికీ స్థానిక ఓటర్లు వారిద్దరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. తిరుపతి లోకసభకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. 

పవన్‍ కళ్యాణ్‍ 2019 ఎన్నికలలో తిరుపతి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లయితే తప్పకుండా విజయం సాధించేవారని జనసేన పార్టీ అభ్యర్ధిని ఎన్నికల బరిలోకి దింపినా.. పవన్‍కున్న జనాదరణ పార్టీ అభ్యర్దికి ఎందుకు ఉంటుందంటున్నారు. పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఉంటే విజయం సాధించేవారనేది జనసేన శ్రేణుల అభిమతంగా వ్యక్తమవుతోంది.