భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. అభియోగాలు మోపడానికి గల కారణాలను, అసలేం జరిగిందనే విషయాలపై మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
హైదరాబాద్: భారతి సిమెంట్స్ పెట్టుబడులకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అభియోగాలు మోపిన విషయం తెలిసిందే. అభియోగాలు మోపడానికి గల కారణాలను, అసలేం జరిగిందనే విషయాలపై మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి.
మీడియా కథనాల ప్రకారం - కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల మధ్య దాదాపు 1400 లక్షల టన్నుల నాణ్యమైన సున్నపురాయి నిల్వలతోపాటు పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి. సమీపంలోని ముంబై-చెన్నై రైల్వే లైన్ అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతంలో సి.రామచంద్రయ్య రఘురామ్ సిమెంట్స్‌ను స్థాపించారు. ఆ కంపెనీని జగన్ టేకోవర్ చేసి భారతి సిమెంట్స్ గా మార్చారు. అప్పటికే ఖనిజ నిక్షేపాల అన్వేషణ కోసం అధ్యయనం చేయడంతోపాటు మైనింగ్‌కు సిద్ధం చేసుకునేందుకు అంబుజా సిమెంట్స్‌కు ఇచ్చిన ప్రాస్పెక్టింగ్ లీజును పక్కనబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి.
అయితే, అంబుజా సిమెంట్స్ ను కాదని రఘురామ్/భారతి సిమెంట్స్‌కు తప్పుడు పద్ధతుల్లో 2037 ఎకరాల సున్నపురాయి గనులున్న ప్రాంతాన్ని లీజుకు కేటాయించారని అంటారు. ఈ కేటాయింపులను చట్టబద్ధంగానే చేసినట్లు చూపించారు. అయితే లీజుల కోసం రఘురామ్, సరస్వతి పవర్ పేరుతో రెండు వేర్వేరు దరఖాస్తులు పెట్టించారు. సరస్వతి దరఖాస్తును తిరస్కరించినట్లుగా చూపించి రఘురామ్ సిమెంట్స్‌కు కేటాయించినట్లుగా చూపించారు. అయితే రెండు దరఖాస్తుల్లో ఫీజుగా చెల్లించిన చలాన్లలో జగన్ సన్నిహితుడు జేజే రెడ్డి సంతకాలు చేశారు. ఈ విషయాన్ని సీబీఐ గుర్తించింది.
వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్‌కు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ) అధికారులే సీఎం నివాసానికి వెళ్లారు. జగన్‌ను కలిసి, ఆయన సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత భారతీ సిమెంట్స్ కు రూ.200 కోట్ల టర్మ్ రుణాన్ని మంజూరు చేశారు.
భారతీ సిమెంట్స్ (తొలుత దీనిపేరు రఘురామ్ సిమెంట్స్) ద్వారా జగన్ అక్రమంగా రూ.5068.05 కోట్లు పొందినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. దాని ఆధారంగా ఈడీ దర్యాప్తు చేపట్టి ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేసింది.
జగన్ మూలధనంగా రూ.30 కోట్లు చెల్లించగా, నిమ్మగడ్డకు సండూర్ పవర్‌లో వాటాలు కేటాయించినట్లుగా చూపి రూ.5 కోట్లు తీసుకొని, రూ.35 కోట్లు వ్యవస్థాపక మూలధనంగా చెల్లించారు. సిలికాన్ సంస్థలో నిమ్మగడ్డ కంపెనీలు పెట్టిన పెట్టుబడులను మళ్లించడం ద్వారా రూ.15 కోట్లు, నిమ్మగడ్డ తన గ్రూపు సంస్థల నుంచి రఘురామ్ సిమెంట్స్‌లోకి పెట్టుబడుల రూపంలో రూ.285.50 కోట్లు పెట్టారు.
దాల్మియా సిమెంట్స్ పెట్టుబడులు, అక్రమ మార్గాల ద్వారా రూ.150 కోట్లు, ఇండియా సిమెంట్స్ పెట్టుబడులు రూ.95 కోట్లు, ఫర్‌పిసిమ్‌కు వాటాల అమ్మకం ద్వారా రూ.1882.20 కోట్లు, మిగిలిన వాటాల విలువ రూ.2604.68 కోట్లు, జగన్ సన్నిహితుడు జేజే రెడ్డి వాటాల విక్రయం ద్వారా రూ.0.67 కోట్లు అక్రమంగా ఆర్జించారు.
కాగా, భారతి సిమెంట్స్‌లో 49 శాతం వాటాలను ఫ్రెంచి కంపెనీకి విక్రయించారు. యాజమాన్య నిర్వహణ అధికారం మాత్రం జగన్ గ్రూప్ చేతిలోనే ఉంది.
