నాటి అమరావతి ఘనచరిత్రను గౌతమీపుత్ర శాతకర్ణిలో.. నేట అమరావతి రైతన్న కన్నీటి గాథను ఖైదీ నెంబర్ 150 లో ఒకేసారి చూడొచ్చు.

తెలుగునాటి ఇప్పుడు అందరూ ఆ రెండు సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. సంక్రాంతి బరిలో పందెంకోళ్లులా దిగుతున్న ఆ రెండు చిత్రాల కథ ...కథనం వేర్వేరు కావొచ్చు.. కానీ .. ఆ రెండు సినిమాల నేపథ్యం మాత్రం ఒక్కటే.

అదే నవ్యాంధ్ర రాజధాని అమరావతి.

అవును మన అమరావతి చుట్టూనే ఆ రెండు సినిమాల కథాంశం కాస్తోకూస్తో తిరుగుతోంది.

ఆనాటి అమరావతి ఘనతని కమ్మగా చెప్పడానికి ఒక సినిమా మన ముందుకు వస్తుంటే.

నేటి అమరావతి రైతన్న కన్నీటి కష్టాన్ని చెప్పడానికి మరో సినిమా వస్తోంది.

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన గౌతమి పుత్రశాతకర్ణి కథాంశం అంతా తిరిగేది అమరావతి చుట్టూనే.

తెలంగాణలోని కోటిలింగాల రాజధానిగా శాతవాహన సామ్రాజ్యం ఉద్భవించినా...వారి చరిత్ర ఘనతకెక్కింది మాత్రం అమరావతి రాజధాని అయినప్పటి నుంచే.

శాతకర్ణి 2 తన రాజ్య విస్తరణలో భాగంగా అమరావతిని రాజధానిగా చేసుకున్నాడు. అక్కడి నుంచే గౌతమీపుత్ర శాతకర్ణి అప్రహతిహాత విజయాలతో దూసుకెళ్లి దేశ చరిత్రలో ఓ కొత్త శకాన్ని సృష్టించాడు. అమరావతి చరిత్రను అజరామరం చేశాడు.

గతమెంతో ఘనకీర్తి కలిగిన అమరావతిని గౌతమీపుత్ర శాతకర్ణిలో చూసి తరిస్తారు సరే, మరి ఇప్పటి అమరావతి ని చూడాలంటే...

ఆ కోరిక తీర్చేడం కోసమే బాస్ హిజ్ బ్యాక్...

అవును మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీలో రైతన్నల కన్నీటి గాథను చూసితరించవచ్చు. అందులో అమరావతి రైతుల క‘న్నీరు’ కనిపించవచ్చు. ఎందుకంటే రైతుల కష్టాలు ఎక్కడైనా ఒకేలా ఉంటాయి.

నీళ్లు లేక పంటెండిపోతున్న రైతన్నలు గుండె ఘోష ప్రధాన కథాంశంగా ఖైదీ నెంబర్ 150 తెరకెక్కుతోంది.

పచ్చని పంటలను చెరపట్టి , నీళ్లన్నీ కొల్లగొట్టి కార్పొరేట్ లకు కట్టబెట్టే నయా వంచకుల భరతం పట్టే ఆపద్భాందవుడిగా చిరు ఇందులో కనిపించనున్నట్లు సమాచారం.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూమి కోసం మూడు పంటలు పండే భూమిని, నిరంతరం నీటి సదుపాయం ఉన్న భూమిని ల్యాండ్ పూలింగ్ తో లాక్కొని ప్రస్తుత పాలకులు కూడా అలానే చేశారు.

పాపం... కన్నబిడ్డలా చూసుకొనే భూమి పోవడం తో ఇప్పడు అమరావతి రైతు కన్నీరు కారుస్తున్నాడు... ఆ కన్నీళ్లు ఖైదీ నెంబర్ 150 లో చూపించే రైతుల కన్నీళ్లకు కనెక్ట్ అవతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

అందుకే ఆ రెండు సినిమాలలో ఒకటి కమ్మటి అమరావతిని... మరొకటి కన్నీటి అమరావతిని చూపిస్తాయి.

సంక్రాంతికి సిద్ధంగా ఉండండి... నాటి అమరావతిని... నేటి అమరావతిని ఒకేసారి చూడడానికి.