చంద్రబాబునాయుడుపై ఒత్తిడి పెరిగిపోతోంది. బడ్జెట్ నేపధ్యంలో రాష్ట్రంలోను పార్లమెంటులోను మొదలైన నిరసనలు, ఆందోళనలు కేంద్రప్రభుత్వంలో ఎటువంటి కదలికలను తెప్పించలేకపోయాయి. పైగా ప్రధానమంత్రి నరేంద్రమోడి, కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో చేసిన ప్రసంగాలు ఇటు జనాలను అటు ఎంపిలను మరింత రెచ్చగొట్టేట్టుగా ఉన్నాయి. దాంతో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచితే తప్ప లాభం లేదని జనాలకు అర్ధమైపోయింది.

ఇటువంటి నేపధ్యంలోనే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో చంద్రబాబునాయుడు తక్షణమే సమావేశం నిర్వహించాలంటూ డిమాండ్లు మొదలయ్యాయి. కేంద్రంపై పోరాటం చేయటంలో భాగంగా వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలంటూ మేధావుల ఐక్యవేదిక చంద్రబాబును డిమాండ్ చేసింది. వేదిక అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా, రాష్ట్రప్రయోజనాల సాధన అన్నది ఒక్క టిడిపికో లేకపోతే వైసిపికో సంబంధించిన సమస్య కాదన్నారు. రాష్ట్రంలోని 5 కోట్లమంది జనాలకు సంబంధించిన సమస్య కాబట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచాలంటే వెంటనే అఖిలపక్ష సమావేశం పెట్టాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.

వచ్చేనెల 5వ తేదీన ప్రారంభమవనున్న మలివిడత పార్లమెంటు సమావేశాల సమయానికి అఖిలపక్షం నేతలు ఢిల్లీలో మకాం వేయాల్సిందే అన్నారు. అఖిలపక్షానికి మద్దతుగా రాష్ట్రంలోని వివిధ వేదికలు, జెఏసిల నేతలు కూడా ఢిల్లీకి వస్తామని చెప్పారు. పరిస్దితులను, తక్షణావసరాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.