టిడిపిలో ‘పాదయాత్ర’ ఆందోళన

టిడిపిలో  ‘పాదయాత్ర’ ఆందోళన

తెలుగుదేశంపార్టీలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కలవరం మొదలైంది. అది కాస్త పంచాయితీ ఎన్నికలను ముందుగా జరిపించేందుకు ఉసిగొల్పుతోంది. వచ్చే ఏడాది ఆగస్టుకు పంచాయితీల కాలపరిమితి పూర్తవుతోంది. రాష్ట్రంలో సుమారు 16500 పంచాయితీలున్నాయి. వాటిని నియోజకవర్గాలుగా లెక్కేస్తే దాదాపు 110 అసెంబ్లీ నియోజకవర్గాలు. ఎందుకంటే, గ్రామీణ ప్రాంతాలున్న నియోజకవర్గాలే ఎక్కువున్నాయి. మున్సిపాలిటి, కార్పొరేషన్లు కేంద్రాలుగా ఉన్న నియోజకవర్గాల సంఖ్య తక్కువే. సరే, టిడిపిలో మొదలైన కలవరం ఏంటనే కదా మీ సందేహం? చదవండి మీకే తెలుస్తుంది.

పంచాయితీ ఎన్నికలపై టిడిపి ఇప్పటికిప్పుడు ఎందుకు దృష్టి పెట్టింది? అంటే, వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రే కారణమట. నవంబర్ 6వ తేదీన మొదలైన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతున్న విషయం అందరూ చూస్తున్నదే. ప్రజాసంకల్పయాత్ర సక్సెస్ తో టిడిపిలో కలవరం మొదలైంది. కడప జిల్లా అంటే ఏదో సొంత జిల్లా కాబట్టి జనాలు బాగా స్పందించారని సరిపెట్టుకుంది.  మరి, పాదయాత్ర పూర్తయిన కర్నూలు, జరుగుతున్న అనంతపురం జిల్లాల్లో జనాలు అంతగా ఎందుకు స్పందిస్తున్నారో టిడిపికి అర్ధం కావటం లేదు. పైగా పాదయాత్రలో జగన్ అత్యధికం గ్రామీణ ప్రాంతాలనే టచ్ చేస్తున్నారు.

అందుకనే, గ్రామీణప్రాంతాల్లో బాగా పట్టుందని ప్రచారం జరుగుతున్న వైసిపిని దెబ్బ కొట్టేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టు సాధించాలంటే ముందుగా పంచాయితీలను గెలవాలన్న విషయం అందరకీ తెలిసిందే. అందుకే టిడిపి ముందుగా పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. జగన్ ను కలుస్తున్న జనాలు కూడా ప్రభుత్వంపై తమకున్న వ్యతిరేకితను బాహాటంగానే కనబరుస్తున్నారు. దానికితోడు జగన్ యాత్రను దగ్గరుండి మానిటర్ చేస్తున్న ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రభుత్వానికి వాస్తవ పరిస్ధితులను అందిస్తున్నారు.

వివిధ మార్గాల్లో తెప్పించుకుంటున్న నివేదికల ఆధారంగా అధికారపార్టీ కూడా క్షేత్రస్ధాయి పరిస్ధితులను భేరీజు వేసుకుంటోంది. సాధారణ ఎన్నికలకు మరెంతో దూరం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి ఎన్నికల ఫలితాలు ఎలాగుంటాయో ఇపుడే ఎవరూ చెప్పలేరు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారాన్ని అందుకోవాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబునాయుడు పెద్ద కసరత్తే చేస్తున్నారు. అందుకనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే ఓటర్లుగా టిడిపి నియోజకవర్గాలను వర్గీకరించింది.

పై రెండు ప్రాంతాల్లోనూ పట్టు సాధించాలంటే ముందు స్ధానిక సంస్ధలను కైవసం చేసుకోవటమే మార్గంగా టిడిపి భావించింది. అందుకనే ముందుగా పంచాయితీ ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఆగస్టుకు పంచాయితీల కాలపరిమితి అయిపోతుంది. కాబట్టే అంతకన్నా ముందే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలన్నది వ్యూహంలో భాగం. ఎటుతిరిగి ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి పంచాయితీలను గెలిచేస్తే తర్వాత ఎన్నికల్లో ఇబ్బందులుండవన్నది టిడిపి ఆలోచన.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos