వచ్చే ఎన్నికల్లో చౌదరికి మొండిచెయ్యేనా ?

First Published 17, Dec 2017, 4:20 PM IST
Tension mounting in prabhakar chowdhary over 2019 elections contest in Anantapuram
Highlights
  • వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్టు అనుమానమేనా?

వచ్చే ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరికి టిక్కెట్టు అనుమానమేనా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ సందేహాలు మొదలయ్యాయి. పోయిన ఎన్నికల్లో అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి తరపున గురునాధరెడ్డి పోటీ చేస్తే టిడిపి తరపున ప్రభాకర్ చౌదరి పోటీ చేసారు. హోరా హోరీగా జరిగిన పోటీలో చౌదరి గిలిచారు. సరే, గెలిచిన దగ్గర నుండి చౌదరిలో ఏమాత్రం సంతోషం లేదు. ఎందుకంటే, టిడిపి తరపునే అనంతపురం ఎంపిగా గెలిచిన జెసి దివాకర్ రెడ్డితో చౌదరికి ఏమాత్రం పడదు. దాంతో ప్రతీ విషయంలోనూ మూడున్నరేళ్ళుగా వీరిద్దరి మధ్య పచ్చ గడ్డి వేయకపోయినా భగ్గుమంటూనే ఉంది.

వీరి మధ్య వైరం ఇలా సాగుతుండగానే చౌదరికి వ్యతిరేకంగా జెసి కొత్త కుంపటిని తీసుకొచ్చారు. అదే గురునాధరెడ్డిని వైసిపి నుండి టిడిపిలోకి తీసుకురావటం. రెడ్డి చేరికను అడ్డుకునేందుకు చౌదరి చాలా ప్రయత్నించారు. చౌదరి భయమేంటంటే, రెడ్డి టిడిపిలోకి వస్తే వచ్చే ఎన్నికల్లో తన పరిస్ధితి ఏంటని? ఎందుకంటే, రెడ్డి కూడా అనంతపురంకు మాజీ ఎంఎల్ఏనే. పైగా జెసి కుటుంబానికి బాగా సన్నిహితుడు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు కోసం చౌదరితో రెడ్డి పోటీ పడటం ఖాయం. అందువల్లే రెడ్డి చేరికను అడ్డుకుందామనుకుని ప్రయత్నించి ఫైల్ అయ్యారు.

సరే, అదంతా జరిగినపోయిన సంగతి. మరి, భవిష్యత్తేంటి? అంటే, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు విషయం చౌదరిలో ఆందోళన మొదలైందన్నది వాస్తవం. ఆ విషయం చౌదరి మాటల్లో స్పష్టంగా కనబడుతోంది. ఎందుకంటే, అనంతపురం ఎంపిగా జెసి కుటుంబసభ్యులే పోటీ చేయటం ఖాయం. కాబట్టి నియోజకవర్గం కేంద్రంలో తమ మద్దతుదారుడే ఉండాలని జెసి పట్టుపడితే చంద్రబాబు కూడా కాదనే పరిస్ధితి లేదు. ఎటుతిరిగి చౌదరి-జెసిలు ఉప్పు నిప్పు. అదే సమయంలో గురునాధరెడ్డి-జెసి బాగా సన్నిహితులు. టిక్కెట్టు విషయంలో జెసి హామీతోనే రెడ్డి టిడిపిలో చేరినట్లు సమాచారం. అందుకే చౌదరిలో ఆందోళన పెరిగిపోతోంది. వ్యవహారం చూస్తుంటే చౌదరికి టిక్కెట్టు విషయంలో ఏదో అనుమానంగానే ఉంది.

 

loader