ఉత్కంఠలో గుజరాత్ కౌంటింగ్

ఉత్కంఠలో గుజరాత్ కౌంటింగ్

గుజరాత్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్లో పాలక భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం భాజపా ఆధిక్యంలో కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కూడా వెన్నంటే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే, గుజరాత్ అన్నది ప్రధానమంత్రి నరేంద్రమోడి స్వొంత రాష్ట్రం. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి ఎన్నికల్లో మొత్తం మోడి సర్వత్రా తానై నడిపించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడి కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేశారు. వీలున్నంతలో ప్రతీ నియోజకవర్గాన్నీ చుట్టారు. చివరకు ముఖ్యమంత్రి  విజయ్ రూపానీని కూడా పక్కనపెట్టేసి మోడి సుడిగాలి పర్యటనలు చేసారు.

ఇటువంటి నేపధ్యంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ అయిన దగ్గర నుండి  ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం భాజపాకే క్లియర్ మెజారిటీ వచ్చింది. కానీ ఓట్ల కౌంటింగ్ మొదలైన తర్వాత అంత సీన్ లేదని స్పష్టమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో పేర్కొన్నట్లుగా కాంగ్రెస్ ఏమీ అంతగా వెనకబడి లేదు.  ఆధిక్యంలో దాదాపు భాజపాను అంటిపెట్టుకునే ఉంది. సరే, ఆధిక్యాలన్నీ గెలుపే అని అనుకునేందుకు లేదు. ఓట్ల లెక్కింపు మొదలైనపుడు భాజపాకున్న ఆధిక్యం ఇపుడు కనబడటంలేదు. మొదట్లో వెనకబడిన కాంగ్రెస్ చాలా స్ధానాల్లో మెరుగవుతోంది.

అంతిమంగా ఫలితాలు ఎలా వస్తాయో ఇపుడే చెప్పేందుకు లేదుగానీ మొత్తానికి ఫలితాలు మాత్రం రసవత్తరంగా మారిపోతోంది. నిముష నిముషానికి ఆదిక్యతలు మారిపోతున్న నేపధ్యంలో ఫలానా అభ్యర్ధి గెలుస్తాడని చెప్పేందుకు లేదు. ఊహించని విధంగా ఎప్పటికప్పుడు మారిపోతున్న ఆధిక్యాలతో ఇరుపార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోంది. చివరకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు పలువురు భాజపా కీలక నేతలు సైతం వెనకంజలో ఉండటం గమనార్హం.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page