చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. తిరుమల సహా ప్రముఖ ఆలయాల మూసివేత ,శుద్ధి తర్వాతే దర్శనాలు
రాహుగ్రస్త ఖండగ్రాస చంద్ర గ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి . శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆదివారం ఉదయం తిరిగి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

రాహుగ్రస్త ఖండగ్రాస చంద్ర గ్రహణం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూతపడ్డాయి. తిరుమల శ్రీవారి ఆలయాన్ని రాత్రి 7.05 గంటలకు టీటీడీ అధికారులు మూసివేశారు. చంద్రగ్రహణం మూసివేసిన తర్వాత 3.15 గంటలకు ఏకాంతంగా శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులు తీస్తారు. అలాగే చంద్ర గ్రహణం కారణంగా శనివారం జరగాల్సిన సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వృద్ధులుకు కల్పించే స్వామివారి దర్శన ఏర్పాట్లను టీటీడీ రద్దు చేసింది.
మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రి పైనున్న కనకదుర్గ ఆలయాన్ని కూడా అధికారులు మూసివేశారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి ఆలయంలోనూ దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు. సింహాచలం వరాహా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, ఒంటిమిట్ట, దేవునికడప, గండి ఆంజనేయస్వామి, మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని కూడా మూసివేశారు. సంప్రోక్షణ అనంతరం ఆదివారం 8 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.