రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషన్నదే కనబడకుండా చేయటానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుకు తెగులు సోకింది. రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో ఇకపై తెలుగు భాషన్నదే కనబడకుండా చేయటానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే, రాష్ట్రంలోని అన్నీ ప్రభుత్వ పాఠశాలలను తక్షణమే ఇంగ్లీషు మీడియంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అవ్వటమే ఇందుకు నిదర్శనం.
తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో అన్నగారు నందమూరి తారక రామారావు(ఎన్టిఆర్) ఓ పార్టీని స్ధాపించారు. ఆ పార్టీకి తెలుగుదేశం అనే పేరు పెట్టారు. అంటే మాటల్లోనే కాదు చేతల్లో కూడా ఎన్టీఆర్ తెలుగుపై తనకున్న అభిమానాన్ని చూపించారు.
అటువంటి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం నుండి మాతృభాష తెలుగును కనుమరుగు చేయాలని చూడటం ఆశ్చర్యంగా ఉంది.
విద్యార్ధుల, ఉపాధ్యాయుల అభిప్రాయాలతో సంబంధం లేకుండా ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండానే చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 2118 మున్సిపల్ పాఠశాలల్లో చదవుతున్న 2.51 లక్షల మంది విద్యార్ధులు అర్ధాంతరంగా మీడియం మార్చుకోవాల్సి వస్తోంది. ఇదెంత ఇబ్బందో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.
చంద్రబాబు నిర్ణయం తీసుకున్నంత తేలిగ్గా విద్యార్ధులు తెలుగు నుండి ఇంగ్లీషు మీడియంకు మారలేరు. అదేవిధంగా ఇంగ్లీషు మీడియంలో చదువు చెప్పగలిగిన ఉపాధ్యాయులూ దొరకరు. ఇటు విద్యార్ధులు చదవలేక, అటు ఉపాధ్యాయులు లేక మొత్తం ప్రాధమిక విద్యా రంగమే అధోగతి పాలవటం ఖాయం.
ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్ధి సంఘాలు, ఉపాధ్యా సంఘాలు వ్యతిరేకిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. మంత్రివర్గం, పార్టీలోని కార్పొరేట్ విద్యా సంస్ధల యాజమాన్యాల ఒత్తిడి వల్లే చంద్రబాబు రాష్ట్రంలో తెలుగు కనిపించకుండా చేయాలని చూస్తున్నట్లు ఆరోపణలు మొదలయ్యాయి.
దేశం మొత్తం మీద మాతృభాషకు సమాధి కట్టాలని చూస్తున్నది ఒక్క ఏపి మాత్రమేనని భాషాభిమానులు పలువురు వాపోతున్నారు.
చూడబోతే, చంద్రబాబు కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడిని చూసి స్పూర్తి పొందినట్లే కనబడుతోంది. ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకోవటం, జనాలను ఇబ్బందుల్లోకి నెట్టటం చూస్తుంటే చంద్రబాబు ప్రధానమంత్రి అడుగుజాడల్లో నడుస్తున్నట్లే కేననబడుతోంది.
