అరెస్ట్ చేయవద్దని చెప్పలేం: వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐని విచారించుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది.

హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తనపై సీబీఐ తవ్ర చర్యలు తీసుకోవద్దని హైకోర్టును ఆశ్రయించారు వైఎస్ వివేకానందరెడ్డి. ఈ పిటిషన్ ను హైకోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డి మధ్యంతర పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అవినాష్ రెడ్డిని విచారించే ప్రాంతానికి న్యాయవాదిని అనుమతించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే కూడా ఇవ్వలేమనిహైకోర్టు తేల్చి చెప్పింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఆరోపిస్తూ కడప ఎంపీ ఈ నెల 8వ తేదీన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరారు. ఈ పిటిషన్ పై ఈ నెల 10 , 13 తేదీల్లో ఇరువర్గాల వాదనలను తెలంగణ హైకోర్టు విన్నది. మరో వైపు ఈ పిటిషన్ లో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీతారెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. సునీతారెడ్డి తరపు న్యాయవాది కూడా కోర్టులో తమ వాదనలు విన్పించారు.ఈ వాదనలను విన్న తర్వాత ఈ నెల 13న తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే తుది తీర్పు వచ్చే వరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది.
also read:కక్షతో పోరాటం చేయడం లేదు: వివేకా సమాధి వద్ద సునీతారెడ్డి నివాళులు
వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ఇచ్చింది. వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించలేమని స్పష్టం చేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని సీబీఐ అధికారులు వరుసగా విచారిస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కు ఆస్తుల గొడవ కారణమని వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపించారు.
మరో వైపు హైకోర్టులో దాఖలు చేసిన ఇంప్లీడ్ పిటిషన్ పై వైఎస్ అవినాష్ రెడ్డిపై వైఎస్ సునీతారెడ్డి పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2019 మార్చి 14వ తేదీ రాత్రి పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసును సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.