సారాంశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య  కేసులో  ఏం జరిగిందనే విషయాలు  అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో  తాను  పోరాటం  చేస్తున్నానని  వైఎస్ సునీతారెడ్డి  చెప్పారు. 
 

పులివెందుల: తన తండ్రి  హత్య కేసులో  నిజం తెలియాలనే ఉద్దేశ్యంతో  తాను  పోరాటం చేస్తున్నానని  మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్  సునీతారెడ్డి  చెప్పారు.

వైఎస్ వివేకానందరెడ్డి  హత్యకు గురై  నాలుగేళ్లు  పూర్తైన సందర్భంగా  పులివెందులలో  వైఎస్ వివేకానందరెడ్డి సమాధి  వద్ద  ఆమె నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. 

నాన్న  హత్య  జరిగినప్పుడు  కర్నూల్, కడపలో    ఇలాంటి ఘటనలు   సర్వసాధారణమని చెప్పారన్నారు.   అయితే ఇది తప్పు అని నిరూపించేందుకు తాను పోరాటం  చేస్తున్నట్టుగా  వైఎస్ సునీతారెడ్డి  చెప్పారు. నిజం  బయటకు వస్తేనే  భవిష్యత్తులో  ఇలాటివి జరగవని ఆమె అభిప్రాయపడ్డారు. వైఎస్  హత్య కేసులో  తనకు  తెలిసిన విషయాలన్నీ దర్యాప్తు సంస్థలకు  చెప్పినట్టుగా  తెలిపారు.  తనకు తెలిసిన విషయాలను ఏనాడూ దాచలేదన్నారు. తమకు తెలిసిన విషయాలను.  దర్యాప్తు సంస్థలకు చెప్పకపోవడం  కూడా తప్పేనన్నారు.    తన తండ్రి హత్య కేసు దర్యాప్తును ఎవరూ ప్రభావితం చేయవద్దని  ఆమె  కోరారు. 

తన తండ్రి  హత్య  కేసుపై  న్యాయం జరగాలని   పోరాటం  చేస్తున్నట్టుగా ఆమె చెప్పారుు. తన పోరాటం  ఎవరి మీద కక్షతో  చేస్తున్నది కాదన్నారు.  ఈ విషయమై  ఎవరికైనా ఏదైనా తెలిస్తే  దర్యాప్తు సంస్థలకు చెప్పాలని ఆమె కోరారు.   తప్పు చేసినవారికి  శిక్షపడితేనే ఇలాంటివి జరగవని ఆమె అభిప్రాయపడ్డారు.  దర్యాప్తు సంస్థల గురించి  కామెంట్  చేయవద్దని ఆమె కోరారు.