దారుణం: లవ్ లెటర్ ఇవ్వలేదని సెవెన్త్ విద్యార్ధికి నిప్పంటించిన ఇంటర్ స్టూడెంట్

Teen sets 7th  grader afire for tearing love letter
Highlights

తన లవర్‌కు ప్రేమ లేఖ ఇవ్వలేదనే కోపంతో 7వతరగతి విద్యార్ధిపై ఇంటర్ విద్యార్ధి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలోని అర్థవీడులో చోటు చేసుకొంది. బాధితుడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

ఒంగోలు:తాను ప్రేమించిన అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వకుండా ఆ లెటర్‌ను చింపేశాడనే కోపంతో 7వ తరగతి  విద్యార్ధిపై పెట్రోల్  పోసి నిప్పంటించాడు ఇంటర్ విద్యార్ధి . తీవ్ర గాయాలపాలైన ఏడవ తరగతి విద్యార్ధి చావు బతులకు మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.  ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకొంది.  ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత మెరుగైన చికిత్స కోసం బాధితుడిని గుంటూరుకు తరలించారు. 

ప్రకాశం జిల్లాలోని అర్ధవీడులో ఇంటర్మీడియట్ కాలేజీ,  స్కూల్ ఒకే భవనం లో ఉంటాయి.  అయితే  శనివారం నాడు మధ్యాహ్నంపూట 7వ తరగతి విద్యార్ధి మధ్యాహ్న భోజనం కోసం వెళ్తున్నాడు . ఆ సమయంలో  ఇంటర్ చదివే విద్యార్ధి ...బాధిత విద్యార్ధి వద్దకు వచ్చి పదవ తరగతి విద్యార్ధిని పేరు చెప్పి తాను ఇచ్చిన లవ్ లెటర్ ను ఇవ్వాలని చెప్పాడు.

కానీ బాధిత విద్యార్ధి ఆ లేఖను చింపేసి భోజనానికి వెళ్లిపోయాడు. భోజనం చేసిన తర్వాత బాధిత విద్యార్ధి వద్దకు వచ్చిన నిందితుడు  లవ్ లెటర్ ఇచ్చావా లేదా అని అడిగాడు. బాధిత విద్యార్ధి మాత్రం తాను లవ్ లెటర్ ఇవ్వలేదని చింపేసినట్టు చెప్పాడు.

దీంతో కోపంతో ఊగిపోయిన ఇంటర్ విద్యార్ధి ఆ బాలుడిని స్కూల్ పక్కనే ఉన్న పాతభవనంలోకి తీసుకెళ్లాడు. అక్కడే తన వెంట తెచ్చుకొన్న పెట్రోల్ బాటిల్ లోని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్ధిని అక్కడే వదిలేసి పారిపోయాడు.

అయితే పాత భవనం ఆవరణలో తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న బాధిత విద్యార్ధిని తోటి విద్యార్ధులు చూసి ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు.వెంటనే ఉపాధ్యాయులు బాలుడిని చూసి చలించిపోయారు. ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధి ఆత్మహత్మాయత్నం చేశారని తొలుత అంతా భావించారు. కానీ, ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చేసిన తర్వాత బాధితుడు నోరు విప్పాడు.

బాధితుడు అసలు విషయం చెప్పడంతో సంఘటనా స్థలంలో పోలీసులు ఆధారాలను సేకరించారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించారు.అయితే కాలిన గాయాలతో విద్యార్ధి అరుపులు  ఎవరికీ ఎందుకు విన్పించలేదనే అనుమానాలు కూడ లేకపోలేదు. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని విద్యాశాఖ ఉన్నతాధికారులు పరామర్శించారు. సంఘటన గురించి అడిగి తెలుసుకొన్నారు. మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరుకు బాధితుడిని తరలించారు.
 

loader