అమరావతి:  ఫెడరల్ ఫ్రంట్‌లో భాగంగా కేసీఆర్ తో కలిసి వైఎస్ జగన్ కలిసి పనిచేయాలని  భావిస్తున్న తరుణంలో సెంటిమెంట్ అస్త్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోంది.  తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ అమలు చేసిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఏపీలో కూడ టీడీపీ అమలు చేస్తోంది.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాడు హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ విషయమై  టీడీపీ నేతలు సెంటిమెంట్ అస్త్రాన్ని తమ అమ్ముల పొది నుండి  బయటకు తీశారు. సెంటిమెంట్ అస్త్రంగానే టీఆర్ఎస్ తెలంగాణలో తమ పార్టీని కాపాడుకొంది.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో  కూడ తెలంగాణలో పీపుల్స్ ఫ్రంట్ విజయం సాధిస్తే చంద్రబాబునాయుడు పెత్తనం సాగిస్తారని  కేసీఆర్ ప్రచారం చేశారు. ఈ ప్రచారం టీఆర్ఎస్‌కు మరింత కలిసి వచ్చిందనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల్లో లేకపోలేదు.

ఇదే తరహాలో సెంటిమెంట్ అస్త్రాన్ని టీడీపీ ప్రయోగిస్తోంది. ఏపీ రాజకీయాల్లో జగన్‌ను అడ్డం పెట్టుకొని  కేసీఆర్ పెత్తనం  చేయనున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో ఆంధ్ర ప్రజల గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేస్తోంది. అంతేకాదు ఏపీకి అభివృద్ధికి అడుగడుగునా టీఆర్ఎస్ అడ్డు పడుతోందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఏపీకి నష్టం కల్గించే ప్రయత్నాలు చేస్తున్నారని  చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ఎంపీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2017 జూలై మాసంలో  సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేసిన వివరాలను బుధవారం నాడు టీడీపీ నేతలు మీడియాకు విడుదల చేశారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో  కేసీఆర్ ఆంధ్ర ప్రజల గురించి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసుల మాదిరిగానే.. ఏపీలో పుట్టినవాళ్లు కూడ వారి వారసులేనని కేసీఆర్  చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు.

ఏపీలో తయారైన బిర్యానీని పేడ బిర్యానీ, రికార్డింగ్ డ్యాన్స్ ఏపీ  ప్రజల సంస్కృతి అంటూ కేసీఆర్ చేసిన విమర్శలను మంత్రి దేవినేని గుర్తు చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య సంస్థలు, ఆస్తుల పంపకంపై వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కారం కాకుండా తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని టీడీపీ నేతలు  ఆరోపిస్తున్నారు.

సీమాంధ్రులు ఎప్పటికైనా హైద్రాబాద్‌లో కిరాయిదారులేనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడ ప్రస్తావిస్తున్నారు. రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ ఎప్పుడు ఏ రకంగా మాట్లాడారనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

కేసీఆర్ తరహాలోనే ఏపీలో కూడ టీడీపీ నేతలు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్‌తో జగన్‌ చేతులు కలుపుతున్నారని టీడీపీ ప్రచారాన్ని ప్రారంభించింది.

దీనికి తోడు ప్రధాని మోడీ డైరెక్షన్‌లోనే  జగన్, కేసీఆర్‌ ఫ్రంట్‌ పేరుతో ఏపీ ఎన్నికల్లో  పనిచేయనున్నారని  టీడీపీ చెబుతోంది. కొంత కాలంగా చంద్రబాబునాయుడు చెబుతున్నట్టుగానే  వైసీపీ, టీఆర్ఎస్‌లు జత కట్టే పరిస్థితులు కన్పిస్తున్నాయి. జగన్‌ను అడ్డు పెట్టుకొని కేసీఆర్ ఏపీపై పెత్తనం చేసే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 


  సంబంధిత  వార్తలు

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని