అమరావతి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కావదం ఏపీ రాజకీయాల్లో  వేడిని పుట్టించింది. ఎన్నికలకు షెడ్యూల్‌ కూడ త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో  ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. రాజకీయగా తమకు నష్టం వాటిల్లకుండా ఉండేందుకు గాను టీడీపీ కూడ వైసీపీపై వ్యూహత్మకంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రానికి అన్యాయం చేసిన టీఆర్ఎస్‌తో జగన్ జత కడుతున్నారంటూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది.

ఏపీలో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్దమౌతున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వేలు పెట్టినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.  ఈ గిఫ్ట్ తీసుకొనేందుకు తాను సిద్దంగా కూడ ఉన్నానని బాబు కూడ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీ రాజకీయాల్లో  చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా  ఉన్న పార్టీలతో కేసీఆర్ టచ్‌లోకి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే చలా కాలంగా  టీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ మధ్య సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దేశంలోని బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో  ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  ఇవాళ వైఎస్ జగన్‌తో హైద్రాబాద్‌లో సమావేశమయ్యారు. జగన్ తో కేసీఆర్ కూడ త్వరలోనే సమావేశం కానున్నారు.

ఏపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్‌తో వైసీపీ జతకట్టడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. ఇదే విషయాన్ని  ప్రజల్లో ప్రచార అస్త్రంగా ప్రయోగించేందుకు సిద్దమైంది. ఏపీ ప్రజలకు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు చేసిన ప్రయత్నాలను టీడీపీ నేతలు ఎత్తిచూపుతున్నారు.

టీఆర్ఎస్ ఎంపీ కవిత  పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో  2017లో దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ టీడీపీ విడుదల చేసింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో  టీఆర్ఎస్ కుమ్మక్కైందని కూడ టీడీపీ ఆరోపణలు చేసింది.

పోలవరం ప్రాజెక్టును అడుగడుగునా అడ్డుకొనేందుకు పార్లమెంట్ ఉభయ సభల్లో టీఆర్ఎస్ సభ్యులు  అడ్డుకొన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కాకుండా టీఆర్ఎస్ అడ్డుపడుతున్నా ఈ విషయాలపై వైసీపీ ఎందుకు నిలదీయడం లేదో చెప్పాలని టీడీపీ ప్రస్తావిస్తోంది.

విద్యుత్ ఉద్యోగుల విభజన, ఏపీ రాష్ట్రం ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఉపయోగించుకొని  డబ్బులివ్వమని తెలంగాణ  చేతులు ఎత్తేసిందని  మంత్రి దేవినేని ఉమ మహేశ్వర్ రావు  గుర్తు చేశారు. కేటీఆర్ తో భేటీ సందర్భంగా   ఈ విషయాన్ని జగన్ ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని  మంత్రి డిమాండ్ చేశారు.

రాష్ట్రానికి నష్టం చేసే  టీఆర్ఎస్‌తో  జగన్ కలిసి అడుగులు వేయడాన్ని ప్రజలంతా గమనించాల్సిన అవసరం ఉందని టీడీపీ కోరుతోంది. ఇక తెలంగాణ నేతలు కూడ జగన్‌తో కేటీఆర్ భేటీ కావడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

తెలంగాణకు జగన్, ఎంఐఎంలు అడ్డుగా ఉన్నారని  తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో  కేసీఆర్ చేసిన విమర్శలను తెలంగాణ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్‌ ఎలా టీఆర్ఎస్‌కు మిత్రుడయ్యాడో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. 

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేటీఆర్ జగన్‌ను బహిరంగంగా కలిసినట్టు చెబుతున్నా.... ఈ రెండు పార్టీల మధ్య  చాలా కాలంగా సంబంధాలు ఉన్నాయని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో  వైసీపీ పోటీ చేసిందని.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ నేతలు  టీఆర్ఎస్‌కు  మద్దతు ఇచ్చారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణలో  టీఆర్ఎస్ విజయం సాధిస్తే ఏపీలో వైసీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు.... సంబరాలు చేయడాన్ని కూడ టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని