అమరావతి: టీఆర్ఎస్‌తో వైసీపీ కలిసి పనిచేసేందుకు  ఆసక్తి చూపడంపై  టీడీపీ ఎదురు దాడికి దిగుతోంది. ఏపీకి నష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్‌తో వైసీపీ జత కట్టడాన్ని టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును  అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ఎంపీ కవిత వేసిన పిటిషన్లను  టీడీపీ నేతలు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.  ఈ మేరకు పోలవరంపై కవిత వేసిన పిటిషన్‌ను టీడీపీ బుధవారం నాడు విడుదల చేసింది.

పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ అనేక ప్రయత్నాలు చేసిందని టీడీపీ  ఆరోపించింది. ఒడిశా రాష్ట్రంతో కలిసి ఈ ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేసిందని మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు ఆరోపించారు. రాజ్యసభలో, లోక్‌సభలో కూడ  ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఆందోళనలు చేసిన విషయాన్ని దేవినేని ఉమ మహేశ్వర్ రావు ప్రస్తావించారు.

ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను నిలిపివేయాలంటూ 2017 జూలైలో  తెలంగాణ జాగృతి తరపున  సుప్రీం కోర్టులో టీఆర్ఎస్ ఎంపీ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని టీడీపీ గుర్తు చేస్తోంది.ఈ మేరకు ఈ వివరాలను బుధవారం నాడు టీడీపీ విడుదల చేసింది. 

పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు అన్ని రకాలుగా టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నాలు చేసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎన్జీజీటీలో టీఆర్ఎస్ నేతలు కేసులు వేసిన విషయాన్ని  టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ముంపు మండలాలను  లాక్కొన్నారని కేసీఆర్ ఏపీని ఇష్టారీతిలో తిట్టారని మంత్రి దేవినేని గర్తుచేశారు.

విద్యుత్ ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీపై కేసీఆర్ పేచీ పెడుతున్నారని దేవినేని చెప్పారు. ఏపీకి శత్రువైన టీఆర్ఎస్‌తో  పండుగ రోజున జగన్ సమావేశమై కుట్రలకు తెరలేపారని దేవినేని ఆరోపణలు గుప్పించారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో  కేసీఆర్ ఆంధ్ర ప్రజలను ఉద్దేశించి  చేసిన వ్యాఖ్యలను మంత్రి దేవినేని మరోసారి గుర్తు చేశారు. సీమాంధ్రులు ఎప్పటికైనా హైద్రాబాద్‌లో కిరాయిదారులేనని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను దేవినేని ప్రస్తావించారు. లంకలో పుట్టినవాళ్లందరూ రాక్షసులేనని ఆంధ్రావాళ్లు కూడ అంతేనని  కేసీఆర్ మాటలను ఆయన గుర్తు చేశారు.

తెలుగుతల్లి మా తల్లే కాదు. . తెలుగుతల్లి మా పాలిట దెయ్యమన్నారు. రికార్డింగ్‌ డ్యాన్స్‌ సంస్కృతి ఆంధ్రా వాళ్లదని కేసీఆర్‌ చెప్పిన విషయాలు జగన్‌కు గుర్తు లేదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో  జగన్‌ లాంటి అవినీతిపరుడు ఎవరూ కూడ లేరని  కేసీఆర్ విమర్శలు చేసిన విషయాన్ని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ గుర్తు చేశారు. బుధవారం నాడు  ఆయన పార్టీ సీనియర్‌ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో  కలిసి  మీడియాతో మాట్లాడారు.

జగన్, ఎంఐఎంలు తెలంగాణను అడ్డుకొంటున్నారని గతంలో కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన ప్రస్తావించారు.ఫెడరల్ ఫ్రంట్ ముసుగులో బీజేపీకి వైసీపీ, టీఆర్ఎస్‌ లు బీ టీమ్‌లుగా వ్యవహరిస్తున్నాయని  ఆయన ఆరోపించారు. జగన్‌ ఫ్యాన్‌కు కేసీఆర్ ఫిదా అయ్యారని రావు చంద్రశేఖర్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేటీఆర్, జగన్ భేటీ రాజకీయాల్లో కొత్త ఒరవడికి  నాంది అని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని