హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే కేసీఆర్ త్వరలోనే ఏపీ రాష్ట్రంలో  వైఎస్ జగన్‌ను కలుస్తారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌తో భేటీ అయితన తర్వాత  బుధవారం నాడు టీఆర్ఎస్ చీఫ్ కేటీఆర్  జగన్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు.ఫెడరల్ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ పలు పార్టీల అధినేతలతో కేసీఆర్ కలిసిన విషయాన్ని  కేటీఆర్ గుర్తు చేశారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.

వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ నిన్న ఫోన్ చేశారని... జగన్ ఆహ్వానం మేరకు తాము ఇవాళ జగన్‌ను కలిసినట్టు చెప్పారు.భవిష్యత్తులో  ఏపీ రాష్ట్రానికి కూడ వైఎస్ జగన్‌తో  స్వయంగా కేసీఆర్ చర్చించనున్నారని ఆయన తెలిపారు.

ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. గతంలో కూడ తమ పార్టీ చీఫ్ కేసీఆర్, పార్లమెంట్‌లో తమ పార్టీ నేత, తమ పార్టీ ఎంపీ కవిత ఈ విషయాన్ని  లేవనెత్తిన విషయాన్ని కేటీఆర్ మరోసారి గుర్తు చేశారు.

రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతమున్న 25 మంది ఎంపీల సంఖ్య సరిపోనందున... ఈ ఎంపీల సంఖ్య 42కు చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఎంపీల సంఖ్య పెరిగితేనే కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీలయ్యే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.

ఏపీ ఎంపీలకు తెలంగాణ ఎంపీలు తోడైతే కేంద్రాన్ని నిలదీసేందుకు అవకాశం ఏర్పడుతోందన్నారు. జాతీయస్థాయిలో రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను అడ్డుకొనేందుకు కేసీఆర్ చేస్తున్న కృషిని  జగన్ అభినందించారు.

కేటీఆర్ అనేక విషయాలను తమతో చర్చించారని ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ ప్రస్తావించిన విషయాలను పార్టీలో చర్చించనున్నట్టు జగన్ తెలిపారు.   త్వరలోనే కేసీఆర్ కూడ  చర్చించనున్నారని .. కేసీఆర్  తో సమావేశం ముగిసిన తర్వాత అన్నీ విషయాలపై లోతుగా చర్చించి నిర్ణయం తీసుకొంటామని ఆయన తెలిపారు.

పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితి నెలకొందని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగానే కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫ్రంట్  రాష్ట్రాల హక్కులను కాపాడే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు.