టిడిపి సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు (71) మృతి చెందారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటూ బుధవారం తెల్లవారు జామున సుమారు 3 గంటల ప్రాంతంలో హటాత్తుగా మరణించారు. కొంత కాలంగా గాలి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. నాలుగు రోజుల క్రితం డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చేరిన గాలి హటాత్తుగా మరణించారు. నాలుగు నెలల క్రితమే ముద్దుకృష్ణమనాయుడు గుండెకు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు,

1983లో గుంటూరు జిల్లాలోని పెదనందిపాడులో కళాశాలలో లెక్షిరర్ గా పనిచేస్తున్న గాలి ఎన్టీఆర్ పెట్టిన టిడిపితో రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు. అప్పటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలోని పుత్తూరు నియోజకవర్గంలో పోటీ చేసి భారీ మెజారిటితో గెలిచిన గాలి మళ్ళీ వెనుదిగిరి చూసుకోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకూ 6 సార్లు ఎంఎల్ఏగా పనిచేశారు. మధ్యలో టిడిపి నుండి కాంగ్రెస్ లో చేరిన గాలి తర్వాత మళ్ళీ టిడిపిలోకి వెళ్లిపోయారు.

నియోజకవర్గాల పునర్వ్యస్ధీకరణలో పుత్తూరు నియోజకవర్గం మాయమైపోవటంతో నగిరి నుండి పోటీ చేశారు. ప్రస్తుతం ఎంఎల్సీగా పనిచేస్తున్నారు. అటవీ, విద్యా, ఎక్సైజ్ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. పుత్తూరులోని వెంకట్రామాపురం గ్రామం గాలి స్వస్ధలం. అక్కడే అంత్యక్రియలు జరుగుతాయి. గాలికి భార్య సరస్వతితో పాటు ఇద్దరు కొడుకులున్నారు. గాలి మరణానికి చంద్రబాబునాయుడుతో పాటు ఇతర నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.