అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: రెండో రోజూ సీఐడీ విచారణకు లోకేష్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇవాళ కూడ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు సీఐడీ విచారణకు హాజరయ్యారు. నిన్న కూడ లోకేష్ ను ఈ కేసులో సీఐడీ అధికారులు విచారించారు. నిన్న ఆరున్నర గంటల పాటు లోకేష్ ను సీఐడీ అధికారులు విచారించారు.ఇవాళ కూడ విచారణకు రావాలని సీఐడీ కోరడంతో ఇవాళ లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు.
నిన్న ఉదయం పది గంటలకు లోకేష్ సీఐడీ విచారణకు హాజరయ్యారు. ఆరున్నర గంటల విచారణ తర్వాత విచారణను ముగించారు. అయితే తనకు న్యూఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉన్నందున విచారణ ముగించాలని సీఐడీని లోకేష్ కోరారు. అయితే ఇవాళ విచారణకు రావాలని లోకేష్ కు సీఐడీ అధికారులు సూచించారు. దీంతో లోకేష్ ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఇవాళ సీఐడీ విచారణ పూర్తైతే లోకేష్ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు కేసులకు సంబంధించి లోకేష్ న్యాయనిపుణులతో చర్చించనున్నారు.
also read:ఇన్నర్ రింగ్ రోడ్ కేసు .. ముగిసిన నారా లోకేష్ సీఐడీ విచారణ, రేపు మళ్లీ రమ్మన్న అధికారులు
నిన్న విచారణ ముగిసిన తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ కు సంబంధించి సీఐడీ అధికారులు ప్రశ్నలు అడగలేదన్నారు. హెరిటేజ్, ప్రభుత్వం నిర్వహించిన పదవుల గురించి అడిగారన్నారు. మొత్తం 50 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్న మినహా మిగిలిన ప్రశ్నలకు ఈ కేసుతో సంబంధం లేదన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు రావాలని లోకేష్ కు ఏపీ సీఐడీ అధికారులు గత నెల చివరలో నోటీసులు జారీ చేశారు. నోటీసులో పేర్కొన్న అంశాలకు సంబంధించి లోకేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో విచారణకు ఈ నెల 10న హాజరు కావాలని లోకేష్ కు ఏపీ హైకోర్టు సూచించింది. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని హైకోర్టు సీఐడీని ఆదేశించింది.