Asianet News TeluguAsianet News Telugu

ఏ మొహంతో జనాలను ఓట్లడగాలి ?

  • ‘‘వచ్చే ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని జనాలను ఓట్లు అడగాలి’’ ?
  • ఇప్పుడిదే టిడిపి ఎంపిలను వేధిస్తున్న పెద్ద ప్రశ్న.
  • ఎందుకంటే, రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల లబ్దిదారుల ఎంపికలో ఎంపిల ప్రమేయమేమీ ఉండటం లేదట.
  • లబ్దిదారుల ఎంపికలో మొత్తం ఎంఎల్ఏలదే కీలకపాత్ర అయితే తామేం చేయాలో ఎంపిలకు అర్ధం కావటం లేదట.
Tdp mps feel leftout at assembly constituency level

‘‘వచ్చే ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని జనాలను ఓట్లు అడగాలి’’ ? ఇప్పుడిదే టిడిపి ఎంపిలను వేధిస్తున్న పెద్ద ప్రశ్న. ఎందుకంటే, రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల లబ్దిదారుల ఎంపికలో ఎంపిల ప్రమేయమేమీ ఉండటం లేదట. లబ్దిదారుల ఎంపికలో మొత్తం ఎంఎల్ఏలదే కీలకపాత్ర అయితే తామేం చేయాలో ఎంపిలకు అర్ధం కావటం లేదట. వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగటానికి జనాల ముందుకు వెళ్ళినపుడు తామేం చేసామని జనాలు అడిగితే ఏం సమాధానం చెప్పాలి? ఇదే విషయాన్ని పలువురు ఎంపిలు చంద్రబాబునాయుడు ముందుంచారు.

ఈమధ్య చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు లేండి. అక్కడ ఎంపిలతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించగా మిగిలిన ఎంపిలు జెసికి మద్దతుగా నిలిచారు. ‘తాము కూడా నేరుగా ప్రజలు ఓట్లు వేస్తేనే గెలిచాము’ అన్నది ఎంపిల వాదన. అది కూడా నిజమే కదా? తమ అనుచరులో లేక జనాలో వచ్చి ఇల్లో లేక రోడ్డో కావాలని అడిగితే మంజూరు చేయించే స్ధితిలో కూడా లేమంటూ జెసి వాపోయారు పాపం. తమ సిఫారసులను ఆమోదించటం ఇష్టం లేకపోతే ఎంఎల్ఏలు ఎంపిలను పట్టించుకోవటం లేదట.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు చెప్పటం వల్లే తామెవరమూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవటం లేదని కూడా ఎంపిలు చెప్పారు. అయితే, ఏ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ జోక్యం చేసుకోవద్దంటే ఇక తాము ఏం చేయాలి? అన్నదే ఎంపిల ప్రశ్న. ప్రతీ రోజు అనేకమంది జనాలు తమ వద్దకు వచ్చి సమస్యలు చెప్పుకుంటుంటారని, కానీ ఎవరికీ తామేమీ చేయలేకపోతున్నామని చంద్రబాబు ముందు ఎంపిలు బోలెడు బాధపడిపోయారు. పనిలో పనిగా పింఛన్లు, ఇతర పథకాల లబ్దిదారుల ఎంపికలో ఎంపిలకు కూడా కోటా కావాలని డిమాండ్ చేసారు.

సరే, చంద్రబాబు మాట్లాడుతూ ‘మీ బాధ అర్ధమైంది’ అన్నారు. లబ్దిదారలు ఎంపికలో పాత్ర ఉండాలనుకోవటంలో తప్పేమీ లేదన్నారు. కానీ ఏ పథకమైనా అమలయ్యేది ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాబట్టి లబ్దిదారుల వివరాలను ప్రభుత్వం దృష్టికి తేవటమో లేక జిల్లా ఇన్చార్జి మంత్రితో మాట్లాడటమో చేయాలన్నారు. ఎంపిల పాత్ర పెరిగితే నియోజకవర్గాల్లో వర్గాలు పెరుగుతాయన్నారు. అయినా ఎంపిల కోటా నిధులుంటాయి కాబట్టి వాటిని వాడుకోవాలని కూడా చంద్రబాబు ఉచిత సలహా పడేసారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios