ప్రధానమంత్రి నరేంద్రమోడి టిడిపి ఎంపిలను ఘోరంగా అవమానించారు. మంగళవారం పార్లమెంటులో తమకు జరిగిన అవమానాన్ని బయటకు చెప్పుకోలేక దిగమింగుకుని భరిస్తున్నారు. ఒకవైపేమో పచ్చమీడియా ఏమో టిడిపి ఎంపిల నిరసనతో కేంద్రంలో ఆందోళన మొదలైందని ఒకటే ఊదరగొడుతోంది. ఇంకోవైపేమో ప్రధాని కానీ కేంద్రమంత్రులు కానీ టిడిపి కేంద్రమంత్రులను, ఎంపిలను కానీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి అన్యాయం జరిగిన విషయాన్ని వివరించేందుకు కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రధానిని కలిసారు. మంత్రితో పాటు టిడిపి ఎంపిలందరూ ముందే అపాయింట్మెంట్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం అందరూ ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ప్రధాని కార్యాలయ సిబ్బంది అందరిని బయటే నిలిపేసారు. కేవలం ఒక్క మంత్రిని మాత్రమే లోపలికి అనుమతిస్తామంటూ చెప్పారు. తామందరమూ అపాయిట్మెంట్ తీసుకున్న విషయాన్ని ఎంపిలు ఎంత చెప్పినా ప్రధాని కార్యాలయం వినలేదు.

చివరకు చేసేది లేక కేవలం సుజనా చౌదరి మాత్రమే ప్రధానిని కలిసి 20 నిముషాల మాట్లాడారు. అప్పుడు కూడా ప్రధాని సుజనా చౌదరిని పెద్దగా పట్టించుకోలేదట. దాంతో బయటకు వచ్చిన తర్వాత సుజనా అదే విషయాన్ని చంద్రబాబుకు ఫోన్లో చెప్పారట.

అంతకుముందు సోమవారం టిడిపి ఎంపిలు, కేంద్రమంత్రులను కలవటానికి హోంశాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అపాయిట్మెంట్ ఇచ్చారు. అయితే అందరూ హోంశాఖ మంత్రి కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఏదో ముక్తసరిగా పది నిముషాలు మాట్లాడి పంపేసారట. సమస్యలేమన్నా ఉంటే ప్రధానితో  చెప్పాలంటూ ఓ ఉచిత సలహా కూడా పారేసారట. అరుణ్ జైట్లీ అయితే మరీ అన్యాయమట. టిడిపి మంత్రులను, ఎంపిలను కలవటానికి అపాయిట్మెంట్ ఇచ్చిన జైట్లీ చివరకు రద్దు చేశారట. అపాయిట్మెంట్ ఎందుకు రద్దు చేసింది కూడా చెప్పనేలేదట. మిత్రపక్షం ఎంపిల విషయంలోనే కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్రానికి న్యాయమేం జరుగుతుంది?