Asianet News TeluguAsianet News Telugu

అయోమయంలో టిడిపి ఎంపిలు

  • చంద్రబాబునాయుడు ఆదేశాలతో టిడిపి ఎంపిలు అయోమయంలో పడిపోయారు.
Tdp mps are in confusion over naidus directions

చంద్రబాబునాయుడు ఆదేశాలతో టిడిపి ఎంపిలు అయోమయంలో పడిపోయారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడండి’ అని చంద్రబాబునాయుడు చెప్పటమే ఎంపిల అయోమయానికి కారణమైంది. ప్రత్యేకప్యాకేజికి చట్టబద్దత, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటు, రాజధానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, పెండింగ్ లో ఉన్న విద్యాసంస్ధలకు అనుమతులు తదితరాల కోసం కేంద్రంతో టిడిపి ఎంపిలు పోరాటం చేయమని ఎంపిలను ఆదేశించారు. నిజంగా చంద్రబాబు ఆదేశాలు చాలా విచిత్రంగా ఉన్నాయి.

ఎందుకంటే, ప్రభుత్వంపైన అధికార పార్టీ నేతలే పోరాటం చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ప్రభుత్వంపైనే అధికారపార్టీ ఎంపిలను పోరాటం చేయమని చెప్పటంలో అర్ధమేంటో చంద్రబాబుకే తెలియాలి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశంపార్టీ భాగస్వామన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కేంద్రమంత్రివర్గంలో టిడిపి ఎంపిలు కూడా ఉన్నారు. ప్రభుత్వంలో భాగస్వామైనపుడు ప్రయోజనాలను సాధించుకోవాలి గానీ పోరాటం చేయాల్సిన అవసరమం ఏంటి?  

ఇక్కడే టిడిపి ఎంపిల్లో అయోమయం మొదలైంది. గడచిన మూడున్నరేళ్ళల్లో రాష్ట్రప్రయోజనాల కోసం పార్లమెంటులో ఎన్నడూ టిడిపి పోరాటం చేసింది లేదు. పైగా పార్లమెంటులో పోరాటం చేసిన వైసిపి ఎంపిలపై రాళ్ళు వేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంపి కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును టిడిపి, భాజపా ఎంపిలు వ్యతిరేకించిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇటువంటి పరిస్ధితుల్లో రాష్ట్రప్రయోజనాలు, పోరాటం అంటే ఏం చేయాలో టిడిపి ఎంపిలకు అర్ధం కావటం లేదు. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి గతంలో మాట్లాడుతూ, ‘కేంద్రంపై పోరాటం చేయకుండా చంద్రబాబే తమ నోళ్ళను కట్టేసారం’టూ చేసిన వ్యాఖ్యలు అందరకీ తెలిసినవే. ఒకవైపు పోరాటం చేయమని చెబుతూనే ఇంకోవైపు నోరెత్తనీయకుండా వెనక్కు లాగటం విచత్రంగా ఉంది.   బహుశా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారేమో అన్న అనుమానాలు మొదలయ్యాయి.

 

 

 

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios