స్ధానికుల ఫిర్యాదు మేరకే కొమ్మలను నరుకుతున్నట్లు శేఖర్ బదలిచ్చారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపి శేఖర్ మొహంపై పిడిగుద్దులు కురిపించారు. దాంతో శేఖర్ ముక్కులో నుండి రక్తం వచ్చింది.

తెలుగుదేశం పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇక ప్రజా ప్రతినిధులైతే చెప్పనే అక్కర్లేదు. అధికార మత్తు తలకెక్కటంతో కళ్లు మూసుకుపోయి ఎదుటి వారిపై దాడులు చేస్తు మరీ చెలరేగిపోతున్నారు. తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ అదే పనిచేసారు. విద్యుత్ శాఖకు చెందిన అసిస్టెంట్ లైన్ మెన్ వీరశేఖర్ పై రమేష్ దాడి చేసి పిడిగుద్దులు కురిపించటంతో శేఖర్ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు.

ఇంతకీ జరిగిందేమిటంటే, కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తిలో సత్యనారాయణ కాలనీ ఉంది. కాలనీలో విద్యత్ వైర్లపై చెట్లకొమ్మలు పడుతున్నాయని, దానివల్ల విద్యుత్ కు తరచూ అంతరాయం ఏర్పడుతోందని స్ధానికులు ఫిర్యాదు చేసారు. దాంతో వైర్లపై పడుతున్న చెట్లకొమ్మలను కొట్టేందుకు శేఖర్ కొంతమంది సిబ్బందితో అక్కడికి వచ్చారు. వైర్లపై పడుతున్న కొమ్మలను తొలగించటం మొదలుపెట్టారు. అదే సమయంలో సిఎం రమేష్ అక్కడికి చేరుకున్నారు.

కారును ఆపి క్రిందకు దిగారు. శేఖర్ ను దగ్గరకు పిలిపించి వాకాబు చేసారు. ఎవరిని అడిగి చెట్లకొమ్మలను నరుకుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. స్ధానికుల ఫిర్యాదు మేరకే కొమ్మలను నరుకుతున్నట్లు శేఖర్ బదలిచ్చారు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎంపి శేఖర్ మొహంపై పిడిగుద్దులు కురిపించారు. దాంతో శేఖర్ ముక్కులో నుండి రక్తం వచ్చింది. విషయాన్ని గమనించిన మిగిలిన సిబ్బంది అక్కడికి చేరుకునే సమయానికే శేఖర్ స్పృహతప్పి పడిపోయారు. వెంటనే సహచరులు జరిగిన విషయాన్ని పై అధికారులకు చెప్పటంతో పాటు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటన మొత్తాన్ని ఆసుపత్రిలోని ఔట్ పోస్టు లో ఫిర్యాదు చేసారు.