ప్రభుత్వాన్ని ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చునని జగన్ అంటున్నారని అయితే ఇడుపులపాయ చాలా బాగుంటుందని.. హిట్లర్ కూడా బంకర్‌లో ఉండేవారని యనమల గుర్తుచేశారు. జయలలిత సైతం రాజధాని మార్చలేదని.. ఊటీలో విశ్రాంతి తీసుకుంటూ అధికారులు, మంత్రులకు డైరెక్షన్లు ఇచ్చేవారని యనమల తెలిపారు.

టీడీపీ హయాంలో చంద్రబాబు ఇతర దేశాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన కూడా అక్కడి నుంచి పాలనా యంత్రాంగాన్ని నడిపించేవారని రామకృష్ణుడు గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వంలో అందరినీ హౌస్ అరెస్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు.

Also Read:ప్రాసెస్ పూర్తి కాలేదు, ట్విస్టిచ్చిన షరీఫ్: టీడీపీ, వైసీపీ వాదనలు ఇవీ

శుక్రవారం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసింది. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను యనమల మీడియాకు వెల్లడించారు.

పోలీసులు సైతం ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగన్ తానే శాశ్వతంగా అధికారంలో ఉంటారనే అపోహలో ఉన్నారని, అయితే ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడిన వారు పవర్‌లో ఉండరని.. ఆయన అడిగింది కూడా ఒక్క ఛాన్సే అని ఆయన సెటైర్లు వేశారు.

పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా జరిగిన పరిణామాలపై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా తాము గవర్నర్‌ను కోరామని యనమల తెలిపారు.

Also Read:సోమవారం ఉదయమే ఏపి కేబినెట్ భేటీ... మండలి భవితవ్యంపై కీలక నిర్ణయం

ఆర్టికల్ 169 ప్రకారం మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వానికి తీర్మానం చేసే అధికారం మాత్రమే ఉందని రామకృష్ణుడు స్పష్టం చేశారు. రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని.. అయితే ఇందుకు చాలా సమయం పడుతుందని యనమల తెలిపారు. సెలక్ట్ కమిటీ అంటే జగన్ ప్రభుత్వానికి భయం ఎందుకని యనమల ప్రశ్నించారు.