వైసీపీ ఎమ్మెల్యేల్లో 80 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అలాంటి బ్యాచ్ అసెంబ్లీలో ఉన్నారని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. జగన్‌ పెద్దగా చదువుకోలేదని, చదువుకోమని అమెరికా పంపిస్తే పారిపోయి వచ్చేశాడన్నారు ఏపీ శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు.

తమ ఎమ్మెల్యేల్లో ప్రొఫెసర్లు, పీహెచ్‌డీలు చేసినొళ్లు, మాజీ ఐఆర్ఎస్‌లు, సినీనటులు ఉన్నారని అది నిజమేనని వాళ్లలో క్రిమినల్ యాక్టర్లు కూడా ఉన్నారని రామకృష్ణుడు సెటైర్లు వేశారు. కౌన్సిల్‌కు ఇద్దరు మంత్రులు వస్తేనే ఎక్కువని, అలాంటిది 22 మంది మంత్రులు వచ్చి కూర్చొన్నారని ఆయన వెల్లడించారు.

Also Read:మండలి రద్దు ఖాయం: వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు

ఓటింగ్ సమయంలో సభలో సభ్యులు కాని వారిని బయటకు పంపాల్సిందిగా తాను ఛైర్మన్‌ను కోరానని యనమల గుర్తుచేశారు. ఆర్డినరి బిల్లు వచ్చినా, మనీ బిల్లు వచ్చినా ఆమోదించేందుకు, తిరస్కరించేందుకు, సెలక్ట్ కమిటీకి పంపేందుకు కౌన్సిల్‌కు అధికారాలు ఉన్నాయని యనమల తెలిపారు.

ఏదో విధంగా బిల్లును ఆమోదింపజేసుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల అభిప్రాయం తీసుకోవడానికే బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిస్తారని.. ఈ ప్రక్రియకు మూడు నెలల సమయం పడుతుందని యనమల తెలిపారు.

చరిత్రలో ఇప్పటి వరకు రాజధానిని ఎవరైనా మార్చారా.. ఒక్క తుగ్లక్ తప్ప. అని యనమల దుయ్యబట్టారు. తుగ్లక్ చేసిన మంచి పనులు కూడా జగన్ చేయట్లేదని రామకృష్ణుడు మండిపడ్డారు. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీలకు చట్టబద్ధత ఏంటని ఆయన ప్రశ్నించారు. కమిటీలు నివేదిక ఇవ్వకముందే రాజధానిపై ఎలా నిర్ణయం తీసుకుంటారని ఆయన నిలదీశారు.

ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీ నుంచి బయటికి పంపించారని, సస్పెండ్ చేస్తేనే తప్పించి ఇతర సమయాల్లో వారిని బయటకు పంపించే హక్కు ఎవరికీ లేదని రామకృష్ణుడు స్పష్టం చేశారు. 151 సీట్లిచ్చి భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు జగన్‌పై ఎందుకంత కక్షని యనమల నిలదీశారు.

Also Read:రాజ్యాంగంలో ఆ పదం లేదు, జయలలిత ఊటీ నుంచి పాలించారు: జగన్

ప్రజల డబ్బుతో న్యాయవాదిని పెట్టుకుని ప్రజలపైనే యుద్ధం ప్రకటిస్తాడా అని రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసెంబ్లీ ఎందుకు..? మంత్రులు ఎందుకు అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పాలనా అనుభవం లేకుండా తమ వద్ద అందరూ పెద్దలున్నారనే భ్రమలో జగన్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు. మండలి ఛైర్మన్ ఏం తప్పు చేశారని ఆయనపై దాడికి యత్నించారని రామకృష్ణుడు నిలదీశారు.  వైసీపీ నేతలు గొప్పవాళ్లయితే దుర్భాషలాడతారా..? దాడి చేస్తారా..? అని యనమల ఆగ్రహించారు.