మండలి రద్దు ఖాయం: వైఎస్ జగన్ చెప్పకనే చెప్పారు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ శాసనసభలో మాట్లాడిన మాటలను బట్టి శాసన మండలిని రద్దు చేయడానికే ఆయన నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దు ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం శాసనసభలో మాట్లాడిన మాటలను బట్టి అది తప్పదనే అనిపిస్తోంది. రద్దు ప్రక్రియ సుదీర్ఘమైందే అయినప్పటికీ ఆయన దానికే సిద్ధపడుతున్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుత శాసన మండలిలో టీడీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంది.
వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు చాలా తక్కువగా ఉంది. శాసన మండలిలో ఆధిక్యంలోకి రావడానికి వైసీపీకి కనీసం మరో రెండేళ్లు పడుతుంది. తాజా పరిణామం నేపథ్యంలో జగన్ అంత దాకా నిరీక్షించడానికి సిద్ధంగా లేనట్లు కనిపిస్తున్నారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి సంబంధించిన బిల్లును వెనక్కి పంపడం ఒక ఎత్తయితే, సీఆర్డీఎ రద్దు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం మరో ఎత్తు.
Also Read: మండలి అవసరమా.. సోమవారం చర్చిద్దాం: అసెంబ్లీలో జగన్
బిల్లులను సెలెక్ట్ కమిటీలకు పంపడంలో టీడీపీ అనుసరించిన వ్యూహంతో వైఎస్ జగన్ తీవ్రంగా దెబ్బ తిన్నారు. దాంతో మండలిపై ఆయనకు పూర్తి వ్యతిరేకత ఏర్పడినట్లు భావించవచ్చు. అదే గురువారంనాటి ఆయన అసెంబ్లీ ప్రసంగంలో వ్యక్తమైంది. మండలి అవసరమా అనే విషయంపై సోమవారం చర్చిద్దామని ఆయన అన్నప్పటికీ నిర్ణయం మాత్రం తీసుకున్నట్లు అర్థమవుతోంది.
మండలి బిల్లులను నిరోధించే సభగా తయారైందని ఆయన తీవ్ర వ్యాఖ్య చేశారు. అంతకు మించిన వ్యాఖ్యలు కూడా ఆయన చేశారు. 28 రాష్ట్రాల్లో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండళ్లు ఉన్నాయని, మన పేద రాష్ట్రానికి అది అవసరమా అనేది ఆలోచించాలని ఆయన అన్నారు.
Also Read: 5 కోట్ల మంది నమ్మకాన్ని వమ్ము చేశారు: మండలిలో పరిణామాలపై జగన్ ఆవేదన
దానికితోడు అసెంబ్లీలోనే పిహెచ్ డీలు చేసినవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు, రైతులు, ఉపాధ్యాయులు, జర్నలిస్టులు ఉన్నారని, ఇంత మంది విజ్ఞానవంతులున్న అసెంబ్లీ ఉండగా పెద్దల సభ అవసరమా అని కూడా ఆయన అన్ారు.
మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఈ పేద రాష్ట్రానికి ఇంత ఖఱ్చు చేసే మండలి అవసరమా అని కూడా ఆయన అన్నారు ఇంత ఖర్చు చేస్తున్న మండలి ప్రజలకు మంచి చేయకపోగా ప్రజలకు అవసరమైన బిల్లులను నిలిపివేసే విధంగా తయారైందని, అటువంటి మండలి అవసరమా అని ఆయన అన్నారు.
అవసరమా అంటూనే శాసన మండలిని రద్దు చేయడానికి గల కారణాలను ఆయన తన ప్రసంగంలో చెప్పారు. దీన్ని బట్టి ఆయన శాసన మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మంత్రి బొత్స అంతకు ముందు చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయి.