సస్పెండ్ అయిన టిడిపి ఎంఎల్సీ దీపక్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది కాబట్టి అవినీతిని చట్టబద్దం చేయాలని డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ, అవినీతికి ఏపి కేరాఫ్ అడ్రస్ గా మారిందని మండిపడ్డారు. ఏ పని కావాలన్నా ప్రభుత్వ సిబ్బంది 5 నుండి 50 శాతం లంచం తీసుకుంటున్నట్లు ధ్వజమెత్తారు. పెరిగిపోయిన అవినీతిని నియంత్రించండి లేదా అవినీతికి చట్టబద్దతైనా కల్పించండని దీపక్ చేసిన డిమాండ్ సర్వత్రా చర్చ మొదలైంది. పార్టీ, ప్రభుత్వంలో దీపక్ డిమాండ్ సంచలనంగా మారింది.

అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి ప్రజలను సోమరులుగా చేసే సబ్సిడీ పథకాలను కూడా ఎత్తేయాలంటూ చంద్రబాబునాయుడుకే సూచించారు. ఒకవైపు సంక్షేమపథకాల పేరుతో చంద్రబాబు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తనిష్టం వచ్చినట్లు పంచిపెడుతున్న సమయంలోనే దీపక్ సబ్సిడీ పథకాను ఎత్తేయాలని డిమాండ్ చేయటం గమనార్హం. జన్మభూమి కమిటీలపై చాలా అవినీతి ఆరోపణలున్నట్లు మండిపడ్డారు. ఇదే విషయాన్ని వైసిపి ఎప్పటి నుండో చెబుతోంది.

అలాగే, ఏపిలో ప్రజా ప్రతినిధుల వ్యవస్ధే సక్రమంగా పనిచేయటం లేదట. అంటే, చంద్రబాబు పాల్పడుతున్న ఫిరాయింపులపై కూడా చంద్రబాబును తప్పుపట్టినట్లైంది. చాలా గ్రామాల్లో త్రాగు నీరు లేనందుకు ప్రభుత్వం సిగ్గుపడాలని ఎద్దేవా చేశారు. బ్రిటీష్ సంస్కృతి నుండి బయటపడాలంటూ ప్రభుత్వానికి సూచించారు. కలెక్టర్లకే అన్నీ బాధ్యతలు అప్పగించటం సరికాదని కూడా చెప్పారు.