టిడిపి ఎంఎల్ఏలే చంద్రబాబుకు షాకిచ్చారు

టిడిపి ఎంఎల్ఏలే చంద్రబాబుకు షాకిచ్చారు

టిడిపిలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు, విమర్శలు చేయటం సహజం. కానీ ప్రభుత్వ తీరుపై సొంతపార్టీ ఎంఎల్ఏలతో పాటు ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా ధ్వజమెత్తుతున్నారు. దాంతో చంద్రబాబునాయుడు బిత్తరపోతున్నారు.

శుక్రవారంతో ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి ఎంఎల్ఏలే ప్రభుత్వ తీరుపై మండిపడటంతో మంత్రులకు ఏం సమాధానం చెప్పాలో దిక్కుతోచలేదు. గుంటూరు వెస్ట్ ఎంఎల్ఏ మోదుగుల వేణుగోపాల రెడ్డి, అద్దంకి ఫిరాయింపు ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ ఒకేసారి రైతు సమస్యలపై ప్రశ్నలు గుప్పించటంతో పాటు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

వారికి సమాధానాలు చెప్పలేక వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రులు తలలు పట్టుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు రావటం లేదని, పంటలను నిల్వ చేసుకునేందుకు సరిపడా గోడౌన్లు అందుబాటులో లేవని ధ్వజమెత్తారు.

పంటల బీమాకు రైతుల నుండి డబ్బులు వసూలు చేస్తున్న ప్రభుత్వం అవసరమైనపుడు మాత్రం వారిని ఆదుకోవటం లేదంటూ మండిపడ్డారు. సొంత పార్టీ ఎంఎల్ఏలే ప్రభుత్వంపై అసెంబ్లీలో తీవ్ర ఆరోపణలు చేస్తున్నపుడు మంత్రులు మాత్రం ఏ మాట్లాడగలరు ?

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో టిడిపి ఎంఎల్ఏలే ధైర్యంగా ప్రజా సమస్యలపై మంత్రులను నిలదీస్తుండటం గమనార్హం.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos